నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. బోధన్‌‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోవడం లేదు. దీంతో బోధన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తం.. 
ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు భోదన్‌లో 144 సెక్షన్‌ విధించారు. అయితే బోధన్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు.