కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దు కేసులో కొత్త టెన్షన్

tension builds up in Komatireddy case as supreme court adjourns the matter to wednesday
Highlights

కొంపదీసి సీన్ మారిపోతుందా ?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు కేసులో తాజాగా కొత్త టెన్షన్ మొదలైంది. వీరిద్దరి సభ్యత్వాలను శాసనసభ రద్దు చేయడం, అనంతరం హైకోర్టు జోక్యం చేసుకుని శాసనసభ నిర్ణయాన్ని కొట్టివేయడం తెలిసిందే. వారిద్దరూ ఎమ్మెల్యేలుగానే ఉంటారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఇచ్చిన రాజపత్రం (గెజిట్)ను హైకోర్టు రద్దు చేసేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును టిఆర్ఎస్ ఛాలెంజ్ చేసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తరుపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకెట్ వైద్యనాథన్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం వీడియో లు సమర్పించడం లో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. హౌస్ నుండి కేవలం స్పీకర్, కార్యదర్శి లకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని అభిషేక్ వాదించారు. ఎమ్మెల్యేలకు పిటిషన్ వేసే అర్హత లేదన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు.

ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసు కు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదని వాదించారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యే కి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం హౌస్ మాత్రమే పిటిషన్ వేయాలని పేర్కొన్నారు. అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న తర్వాత కేసును బుధవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.

ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలు రద్దు కావడం,  ఆ రద్దును హైకోర్టు రద్దు చేయడం జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఫుల్ బెంచ్ కి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ వేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే ఈ కేసు వేసిన ఎమ్మెల్యేల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వారి వాదనలో పస లేదని కాంగ్రెస్ పార్టీ తరుపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు.

మొత్తానికి కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దు కేసు మరో మలుపు తిరుగుతుందా? లేక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేస్తుందా అన్న టెన్షన్ షురూ అయింది. బుధవారం భవితవ్యం తేలనుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

loader