హైదరాబాద్: త్వరలోనే తెలుగు టెక్కీ చరితారెడ్డికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ అమెరికా మిచీగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.

Also read:అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి

మూడు రోజుల క్రితం జరిగిన మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతి చెందింది. హైద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌‌లోని మధురానగర్‌‌కు చెందిన చంద్రారెడ్డి, శోభ దంపతుల కూతురే చరితారెడ్డి. తెలుగు టెక్కీచరితారెడ్డి మరో రెండు మాసాల్లో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకొంటుంది.ఈ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొంది.

చరితారెడ్డికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌కు వచ్చేందుకు ఆమె ఏర్పాట్లు కూడ చేసుకొంటుంది. ప్రమాదానికి ముందు రోజే చరితారెడ్డి సోదరుడితో  పోన్‌లో మాట్లాడింది. ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 నేరేడ్‌మెట్ మధురానగర్‌లో సమార్టన్ హైస్కూల్‌, నారాయణ కాలేజీలో ఆమె విద్యాభ్యాసం చేసింది. గీతం కాలేజీలో ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2015లో ఎంఎ్స చేసేందుకు చరితారెడ్డి అమెరికా వెళ్లారు.

 అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే అమెరికాలోని డెలాయిట్‌లో చరితారెడ్డికి ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె తిరిగి అమెరికాకు వెళ్లింది.  మూడేళ్లుగా ఆమె అక్కడే పనిచేస్తోంది. ఈ సమయంలోనే టెక్కీ చరితారెడ్డి తన అవయవాలను దానం చేసేందుకు అంగీకారపత్రాన్ని అమెరికా అధికారులకు ఇచ్చారు.

తమ కుటుంబానికి చరితారెడ్డి అండగా ఉందని కుటుంబసభ్యులు  భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని కోలుకోలేని షాకిచ్చింది.