హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ కుటుంబం కూడా హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకుపోయింది. అయితే తాము తాము క్షేమంగానే వున్నట్లు రామకృష్ణ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది.
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. వూళ్లకు వూళ్లే వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు కూడా అక్కడ వరదల్లో చిక్కుకుపోయారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ కుటుంబం కూడా హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వారి క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము క్షేమంగానే వున్నట్లు రామకృష్ణ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. తాము త్వరలోనే హైదరాబాద్‌కు తిరిగి వస్తామని రామకృష్ణ తెలిపినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు చిక్కుకుపోయారు. మనాలిలో వీరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో వీరి క్షేమ సమాచారంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిని బానోత్ కమలాలాల్, రోహిత్ సూరి, శ్రీనివాస్‌గా గుర్తించారు. మరోవైపు డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ కార్యాలయాన్ని సంప్రదించింది.
Also Read: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు .. ఫోన్లు స్విచ్చాఫ్, రంగంలోకి తెలంగాణ వైద్యుల సంఘం
ఇదిలావుండగా.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో కొందరు తెలుగు విద్యార్ధులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందడంతో మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ను ఆయన అప్రమత్తం చేశారు. కులు, మనాలిలో కొందరు విద్యార్ధులు చిక్కుకుపోవడంపై పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కేటీఆర్‌కు కొందరు విద్యార్థుల పేరేంట్స్ సమాచారం ఇచ్చారు.
తమ పిల్లలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌ను అప్రమత్తం చేసి... హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా సహాయం అవసరమైతే తమను సంప్రదించాలని మంత్రి కోరారు.
మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుకున్న వారి కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సహాయం కోసం 9643723157, 9871999044 ఫోన్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే rctelangana@gmail.com లో ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
