Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ నిధుల స్కామ్: సైనింగ్ అథారిటీ వీరే... అసలేం జరిగింది?

తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు నాలుగు బ్యాంకుల నుంచి నిధులు దారి మళ్లాయి. ఇది ఎలా జరిగే అవకాశం ఉందనేది ప్రశ్న.

Telugu Akademi scam: What are the possibilities to fraud
Author
Hyderabad, First Published Oct 1, 2021, 9:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తెలుగు అకాడమీకి చెందిన నిధులను వివిధ బ్యాంకుల్లో నిర్దిష్ట కాలానికి విశ్వసనీయమైన బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే, ఆ నిధులను డిపాజిట్ చేయడానికి అధికారులు 34 బ్యాంకులను ఎంచుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే నాలుగు బ్యాంకుల్లో గోల్ మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎన్ని బ్యాంకుల్లో అక్రమాలు జరిగాయనేది తేలాల్సే ఉంది. అకాడమీ ఆర్థిక లావాదేవీల విషయంలో సంస్థ డైరెక్టర్ కు, అకౌంట్స్ ఆఫీసర్ కూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సైనింగ్ అథారిటీ కూడా వీరే. ఆర్థిక లావాదేవీల వ్యవహరాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే, తమ సంతకాలను, లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేశారని అధికారులు అంటున్నారు. గోల్ మాల్ జరిగిన మొత్తం చిన్న సొమ్మేమీ కాదు, దాదాపు 63 కోట్ల రూపాయల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను మింగేస్తూ ఉంటే అధికారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. 

తాము డిపాజిట్ చేసిన సొమ్ము భద్రంగా ఉందా, లేదా అనేది చూసుకోరా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. బ్యాంకుల నుంచి మెసేజ్ వచ్చే ఆప్షన్ ను సంస్థ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకోలేదా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కోట్లాది రూపాయలు బదిలీ అవుతున్నప్పుడు బ్యాంకు అధికారులు సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదా అనేది కూడా ప్రశ్న. ఈ కారణంగానే బ్యాంకు అధికారులే అక్రమాలకు పాల్పడ్డారనే వాదనను అకాడమీ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో సంబంధిత బ్యాంక్ మేనేజర్ మీద బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకుంది.

Also Read: తెలుగు అకాడమీ నిధుల స్కామ్: తవ్వుతున్న కొద్దీ.... మరో గోల్ మాల్ వెలుగులోకి..

గోల్ మాల్ మీద వచ్చిన వార్తాకథనంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ పేరు మాత్రమే ఉంది. తెలుగు అకాడమీ అధికారులు చేసిన ఫిర్యాదులో కూడా బహుశా అతని పేరే ఉండి ఉంటుంది. నిజానికి అతను సంస్థ ఉద్యోగి కాడు. సంస్థకు చెందని ఓ వ్యక్తి సంస్థ ఆర్థిక లావాదేవీల్లో ఎలా భాగస్వామిని చేశారనేది ఓ ప్రశ్న. ఈ గోల్ మాల్ వ్యవహారాన్ని బ్యాంకు అధికారులకు అంటగట్టే ప్రయత్నం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. బ్యాంక్ అధికారులే ఆ పనులు చేస్తే ఒక బ్యాంకులోని ఓ బ్రాంచ్ లో జరుగుతుంది, కానీ నాలుగు బ్యాంకుల్లో అదే జరగడం పలుసందేహాలకు తావు ఇస్తోంది. తెలుగు అకాడమీ సంబంధిత అధికారుల పాత్ర లేకుండా జరగదనే అభిప్రాయం సంస్థ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ గోల్ మాల్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విచారిస్తోంది. అలాగే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ సోమిరెడ్డిని, ఏసీవో రమేష్ ను విచారించినట్లు తెలుస్తోంది. రఫీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన రఫీక్ ఈ పనిచేశాడని చెప్పడానికి ఏ విధమైన హేతుబద్ధత లేదు. ఇంత చిన్న ఉద్యోగి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతారని ఎవరూ అనుకోరు. పైగా, యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం మాచ్యురిటీకి ముందే ఇతర బ్యాంకులకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. మాచ్యురిటీకి అంత పెద్ద మొత్తం చిన్నపాటి బ్యాంకులకు బదిలీ కావడం, వాటి నుంచి వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ కావడం అనేది అకాడమీ ఉన్నతాధికారుల పాత్ర లేకుండా జరుగుతుందని ఊహించలేమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.  

ఆర్థిక అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చిన వెంటనే అకాడమీ ఉద్యోగులు కొంత మంది డైరెక్టర్ సోమిరెడ్డిని కలిసి ఎసీవో రమేష్ ను సస్పెండ్ చేయాలని కోరారు. ఆయనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించాలని కూడా కోరారు. కానీ అటువంటిదేమీ చేయడానికి సోమిరెడ్డి ముందుకు రాలేదు. దానిపై అకాడమీ ఉద్యోగ సంఘాల నాయకులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. 

రాష్ట్ర విభజన అంశం ముందుకు రాకపోతే ఈ గోల్ మాల్ బయటపడేది కూడా కాదని అంటున్నారు. విభజనలో భాగంగా నిధులను పంచి ఇచ్చే పని జరుగుతున్న సమయంలో ఇది బయటపడింది. మొత్తం మీద, విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు అమూల్యమైన పుస్తకాలు అందిస్తూ వస్తున్న అకాడమీ లాభాల్లో ఉంది. దాదాపు 350 కోట్ల రూపాయల నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో ఎన్ని భద్రంగా ఉన్నాయనే సందేహం వ్యక్తమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios