తెలుగు భాషాభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్న తెలుగు అకాడమీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మాతృభాషగా తెలుగు బ్రతికున్నంత కాలం తెలుగు అకాడమీ కూడా నిలిచిఉంటుందని అన్నారు. తెలంగాణ కవులు, రచయితలు,సాహిత్య ప్రియులు, విద్యార్థులు, నిరుద్యోగులకు తెలుగు అకాడమీ అండగా ఉంటోందని ఉప ముఖ్యమంత్రి కితాబిచ్చారు. 

తెలుగు భాష అభ్యున్నతి కోసం తెలుగు అకాడమీ 1968 ఆగస్ట్ లో ఆవిర్భవించింది. ఇలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయబడిన సంస్థ నిరాటంకంగా తన 49ఏళ్ల సుధీర్ఘ ప్రస్తానాన్ని ముగించుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా అకాడమీ అధికారులు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాతృభాష కోసం అకాడమీ చేస్తున్న సేవలను కొనియాడారు. 

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలతో పాటు జాతీయ స్థాయి పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు సాయపడాలని మంత్రి సూచించారు. అలాగే తెలంగాణలోని ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగును తప్పనిసరి చేసిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంచి పుస్తకాలను ముద్రించి మాతృభాష విద్యార్థులను సులభంగా అర్థమయ్యేలా చేయాలన్నారు. తెలుగు అకాడమీ ఇప్పటికే ఉన్నతంగా పనిచేస్తోందని, అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా  ప్రామాణికతతో, నాణ్యతతో పుస్తకాలను రూపొందించి మరింత మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

స్వర్ణోత్సవాల్లో భాగంగా కడియం నూతనంగా కోటీ నలభై లక్షల రూపాయలతో నిర్మించిన తెలుగు అకాడమీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగు అకాడమీ ప్రత్యేక సంచిక, 50 సంవత్సరాల మోనోగ్రామ్ ను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, మాజీ డైరెక్టర్ వెలిశాల కొండల్ రావు, చీఫ్ ఇంజనీర్ మల్లేషం, ఇతర అధికారులు, అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.

వీడియోలు

"