హైదరాబాద్: అటవీశాఖాధికారులు నిజాయితీపరులైతే సీబీఐ విచారణకు సిద్దమా అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రశ్నించారు.

అటవీశాఖాధికారులపై  సోషల్ మీడియా వేదికగా  నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయమై ఆయన గురువారం నాడు స్పందించారు.

అటవీశాఖాధికారులపై తన వ్యాఖ్యలు తప్పు అనిపిస్తే కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు.కొందరు అధికారుల వల్లే అడవులు అంతరించిపోయాయని ఆయన ఆరోపించారు. దమ్ముంటే జాయింట్ సర్వే చేయిద్దాం.. రావాలని ఆయన సవాల్ విసిరారు.ప్రభుత్వ భూములు మీ కబ్జాలో ఉంటే శిక్షకు సిద్దమా అని ప్రశ్నించారు.

గ్రామాల్లోకి వచ్చే అటవీశాఖాధికారులను నిర్భంధించాలని రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కోరారు. పోడు భూముల విషయంలో అటవీశాఖాధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.ఈ భూముల విషయాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందన్నారు.

also read:గ్రామాల్లోకి అటవీశాఖాధికారులొస్తే నిర్భంధిస్తాం: ప్రభుత్వ విప్ కాంతారావు

అప్పటివరకు అటవీశాఖాధికారులు  ఆదీవాసీల జోలికి వెళ్లకూడదని కోరినా కూడ పట్టించుకోవడం లేదన్నారు.అటవీశాఖాధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేనందునే తాను స్పందించాల్సి వచ్చిందని ఆయన మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.