ఖమ్మం:  గ్రామాల్లోకి అటవీశాఖాధికారులు వస్తే నిర్భంధిస్తామని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు  హెచ్చరించారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీశాయి. ఆదీవాసీలకు పోడు భూముల విషయంలో ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వం పట్టాలిచ్చినా కూడ ఆ పట్టాలు చెల్లవని అటవీశాఖాధికారులు చెబుతున్నారన్నారు. అటవీశాఖాధికారుల తీరు సరిగా లేదన్నారు.తమకు ఓపిక నశించిందని  కాంతారావు చెప్పారు. అటవీశాఖాధికారులు, రెవిన్యూ అధికారులకు మధ్య సరిహద్దు నెలకొందన్నారు.

తాను సోషల్ మీడియాలో ప్రకటించిన మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన చెప్పారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం కల్పిస్తానని సీఎం ఇచ్చిన హామీ గురించి  ఆయన ప్రస్తావించారు. 

పోడు భూముుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం కార్యచరణ తీసుకొంటుందని ఆయన చెప్పారు. కరోనా కారణంగా ఈ సమస్య పరిష్కారం కావడానికి ఆలస్యమైందని కాంతారావు ఓ తెలుగు మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

పోడు భూములు సాగు చేసుకొంటున్న రైతుల పట్ల అటవీశాఖాధికారులు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.