మిస్ ఇండియా 2020 టైటిల్ ను తెలంగాణ అమ్మాయి సొంతం చేసుకుంది. 23యేళ్ల యువ ఇంజనీర్ మానస వారణాసి వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 

హైదరాబాద్ కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ ఛేంజ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. 

2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున మానస పాల్గొంటారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. బుధవారం ముంబైలో నిర్వహించిన ఫైనల్‌ పోటీలో హర్యానాకు చెందిన మణికా షియోకాండ్  మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020కాగా, యూపీకి చెందిన మన్యసింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. 

మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్ లో సినీ నటులు నేహా ధూపియా, చిత్రాంగధా సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్  ఫాల్గుని ఇంకా షేన్ పీకాక్ న్యాయనిర్దేతలుగా ఉన్నారు. 

మొదటి రౌండ్ కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. ఈ పోటీకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 28న కలర్స్ టీవీ చాన‌ల్‌లో ప్రసారం కానుంది.