తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని మనస్థాపానికి గురై ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పొతంగల్ గ్రామానికి చెందిన నరేశ్(22) కొన్ని సంవత్సరాలుగా బోర్లంలోని తన మేనమామ మద్ది బాలయ్య వద్ద ఉంటున్నాడు. అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే.. తనకు పెళ్లి వయసు వచ్చిందని.. పెళ్లి చేయాలంటూ తల్లి విఠవ్వ, అన్న కిషన్ ని అడుగుతూ ఉండేవాడు. అయితే వాళ్లు మాత్రం అప్పుడే ఏం తొందరవచ్చింది.?  కొద్ది రోజులు ఆగు అంటూ నచ్చచెప్పేవారు.

Also Read మేన కోడలిపై కన్నేసి... బలవంతంగా కోరిక తీర్చుకొని...

అయితే... ఇక తనకు పెళ్లి కాదని నరేశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరేశ్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. 

నాలుగు రోజుల పాటు అక్కడ చికిత్స అందించిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమించిందని మూత్ర పిండాలు, కాలేయం దిబ్బతిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలైన తల్లిదండ్రులు బుధవారం నరేశ్‌ను ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యం విషమించి గురువారం ఇంటి వద్ద నరేశ్‌ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.