తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా  ఉంటారో తెలిసిందే. క్షణం తీరిక లేకుండా విధుల్లో, ఇంటి బాధ్యతల్లో తలమునకలై వున్నా.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.

పోలీస్ శాఖకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయడంతో పాటు అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. తాజాగా సుమతి ఒక ఫన్నీ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఆమె ఛాయ్ వాలా  నైపుణ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఫేమస్ అయిన ఇరానీ చాయ్‌ తాగేందుకు డీఐజీ సుమతి ఒక షాపు ముందు ఆగారు. ఆమె టీ కప్ తీసుకుంటుండగా అసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఆ చాయ్ వాలా ఆ కప్పును సుమతికి దొరక్కుండా చేస్తూ.. ఫన్నీ ఫీట్లతో ఎంటర్‌టైన్ చేశాడు. తన ఎదుట వుంది పోలీసు ఉన్నతాధికారి అనే విషయం తెలిసికూడా తన విన్యాసాలు ప్రదర్శించాడు.

ఆమె కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఆ విన్యాసాలకు నవ్వుకున్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టారు.