హైదరాబాద్: నిన్న(గురువారం) మాదిరిగానే ఇవాళ కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.

ఇక శనివారం రాష్టంలో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో అత్యధికంగా 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. 

ఆకాశం మేఘావృతం కావడంతో చలి తీవ్రత తగ్గింది. గురువారం అత్యల్పంగా కామారెడ్డి జిల్లా పిట్లంలో 17.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు, హైదరాబాద్‌లో ఉదయం కొంత ఉక్కపోత కనిపించింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.