Asianet News TeluguAsianet News Telugu

ముంచెత్తుతున్న వర్షాలు... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భయాందోళన

బుధవారం రాత్రి నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు మరోసారి  పొంగిపొర్లుతున్నాయి. 

telangana weather report... heavy rain in adilabad district
Author
Adilabad, First Published Aug 19, 2021, 11:12 AM IST

ఆదిలాబాద్: తెలంగాణలో గతకొన్నిరోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ జోరందుకున్నాయి.  వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండగా దీనికి తోడు ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించి వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. 

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిర్మల్ పట్టణంలో కొన్ని కాలనీల్లో ఇళ్లను సైతం వరదనీరు ముంచెత్తాయి. ఆ భయానక పరిస్థితులను  ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

read more  బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్రను ముంచెత్తనున్న వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 12.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక బజారుహత్నూరులో 12.04సెం.మీ, తాంసిలో 11.28సిం.మీ, ఆదిలాబాద్ పట్టణంలో 10.26సెం.మీ ల వర్షపాతం నమోదయ్యింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios