మరో రెండురోజులు ఆంధ్ర ప్రదేశ్ లో మరీ ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అమరావతి: మరో రెండురోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని... దీనికి తోడు ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించి వుందన్నారు. వీటి ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిశాయని... ఈ వర్షాలు బుధ, గురువారాల్లో కూడా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇక తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం వుందన్నారు. రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుడి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందట. రాయలసీమలో కూడా ఒకటీ, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని... సముద్రం అలజడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
read more విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...
ఇక తెలంగాణలోనూ వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలు ఇవాళ, రేపు కూడా కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. దీంతో ఉష్షోగ్రతలు కూడా తగ్గుతాయని తెలిపారు. హైదరాబాద్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత కూడా తగ్గనుందని వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల రాకతో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇకపై వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఆనందాన్ని నింపింది.
