హైదరాబాద్: రానున్న రెండురోజులూ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించింది.  

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని... దీని ప్రభావంతోనే  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల‌, కొమరంభీం, క‌రీంన‌గ‌ర్, మహబూబాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. 

గతకొద్ది రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని నీటిపారుదల రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.