Asianet News TeluguAsianet News Telugu

సర్కారు కుతిక పట్టిన నిరుద్యోగులు

  • మొత్తం ఖాళీలకు సవరణ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
  • 42 నెలలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారని ఆగ్రహం
  • 18 నెలల్లోనే మరో నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్న
  • పోస్టుల సంఖ్య పెంచకపోతే పోరుబాట తప్పదని హెచ్చరిక
Telangana unemployed up in arms against sarkar for jobs

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 42 నెలలుగా నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. వారికి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలక భూమిక పోశించారు. ఎందుకంటే అందులో వారి స్వార్థం కూడా ఇమిడి ఉంది. తెలంగాణ వస్తే భారీగా ఉద్యోగాలొస్తాయన్న ఆశ వారిది. అదీకాక.. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలను పుట్టించినది. ఈ నేపథ్యంలో సహజంగానే యువత తెలంగాణ ఉద్యమంలో గొంతు కలిపింది.. కదం తొక్కింది. ఆత్మబలిదానాలు చేసుకుని అయినా తెలంగాణ సాధించాలన్న మంకు పట్టు పట్టింది. అంతిమంగా తెలంగాణ సాధించింది. తెలంగాణ రాగానే వేలాది ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసింది యువత. తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన ఉన్న రాజకీయ పార్టీ అధికారంలోకి రావడంతో ఆశలు భారీగా పెట్టుకున్నది. మా పంట పండినట్లే అని సంబర పడింది. కానీ 42 నెలల పాలన వారి ఆశలు నెరవేరకపోగా ఉల్టా అయింది.

నియామకాలు అనే ఉద్యమ నినాదం గాలిలో కలిసిపోయింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నీరుగారిపోయింది. లక్షా 12వేల ఖాళీలను తొలి ఏడాదిలోనే భర్తీ చేస్తామని తొలినాళ్లలో తెలంగాణ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అంతకుముందు కూడా ఉద్యమకాలంలో బల్లగుద్ది చెప్పింది టిఆర్ఎస్. కానీ అచరణలో అధ్వాన్నంగా వ్యవహరించింది. 42 నెలల కాలంలో పట్టుమని 30వేల కొలువులు కూడా నింపలేకపోయింది సర్కారు. మరో 18 నెలల పాలన మిగిలి ఉండగా.. ఇంకా 80వేల పైచిలుకు ఉద్యోగాలు నింపగలరా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీంతో యువత సర్కారు మీద గరం గరం అయితున్నది. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ సర్కారు రకరకాలుగా వైఫల్యం చెందుతున్నది. కొన్ని సందర్భాల్లో కావాలని కొర్రీలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి వారి ఆగ్రహానికి లోనైన పరిస్థితి ఉంది. ఉద్యోగాలు కల్పించే విషయంలో సర్కారు చిత్తశుద్ధి లోపించడం ఒక భాగమైతే.. టిఎస్పిఎస్సీ అవగాహనా రాహిత్యం మరో కారణంగా చెబుతున్నారు. అందుకే దేశంలోనే నెంబర్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని గొప్పలు చెప్పుకుంటున్న టిఎస్పిఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ కోర్టుల్లోకి ఎక్కి మొట్టికాయలేపించుకుంటున్నాయి. అడ్డగోలు నిబంధనలు, చెత్త నిర్ణయాలతో సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. దీనికితోడు ఉద్యోగాలు కల్పించాలన్న యావ ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అనుమానం మాత్రం యువతలో రగులుతున్నది. అందుకే ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి.

Telangana unemployed up in arms against sarkar for jobs

తాజాగా పాత పద్ధతి డిఎస్సీని తీసేసి దాని స్థానంలో వివాదాలు నెలకొల్పేలా టిఆర్టీ ని తీసుకొచ్చారు. అది కూడా కోర్టు మెట్లెక్కింది. ఇటు సర్కారుకు, అటు సర్వీస్ కమిషన్ కు గట్టిగానే మొట్టికాయలేసింది. కొత్త జిల్లాలు తెచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఈ రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోందని అన్ని వైపులా విమర్శలు గుప్పుమంటున్నాయి. కేవలం సుప్రీంకోర్టులో కేసు నుంచి ఉపశమనం కోసమే ఉత్తుత్తి టిఆర్టీ నోటిఫికేషన్ జారీ చేశారా అన్న అనుమానాలు సైతం ఇప్పుడు కలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సవరణ నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ సర్కారు ముందుకొచ్చింది. మరి సవరణ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే... అసెంబ్లీ సాక్షిగా, కేబినెట్ సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలను అమలు చేయాలని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం సర్కారు కుతిక పట్టుకుంటున్నారు.

15వేల పైచిలుకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే నాలుగేళ్లుగా ఒక్క ప్రకటన కూడా ఇవ్వకుండా.. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా... అదిగో, ఇదిగో అంటూ ఊరించి ఇప్పుడు 8వేలకే నోటిఫికేషన్ ఇచ్చారని నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అది కూడా కొత్త జిల్లాల పేరుతో ఇవ్వడంతో కోర్టు చివాట్లు పెట్టిందన్నారు. ఈ పరిస్థితుల్లో సవరణ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కేబినెట్ లో ప్రకటించిన రీతిలో మొత్తం టీచర్ పోస్టుల ఖాళీలన్నింటినీ కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడానికే టిఆర్ఎస్ సర్కారుకు 40 నెలలు పట్టిందంటే... ఇప్పుడు సవరణ నోటిఫికేషన్ కూడా 8వేలకే ఇస్తే... దాన్ని పూర్తి చేసి మరో నోటిఫికేషన్ జారీ చేయడానికి మరో 40 నెలలు పట్టే ప్రమాదం ఉంది కదా అని ఓయు జెఎసి నేతలు మండిపడుతున్నారు. ఆలోగా తెలంగాణ కోసం కొట్లాడిన యువత, తెలంగాణ వస్తే జాబులు వస్తాయని ఆశపడ్డ వారంతా ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు ఏజ్ బార్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ సర్కారుకు కేవలం మరో 18 నెలల సమయం మాత్రమే ఉన్నందున ఈలోగా రెండు నోటిఫికేషన్లు వేసి కొలువులు ఇచ్చే సమర్థత ఎంతమాత్రం లేదని తేలిపోయిందటున్నారు. అందుకే సవరణ నోటిఫికేషన్లో ఆరు నూరైనా ఉన్న ఖాళీలన్నీ కలపాలి... కొత్తగా రిటైర్ అయిన వారి పోస్టులను కూడా జత చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana unemployed up in arms against sarkar for jobs

ఈ డిమాండ్ తో తెలుగు అకాడమీ పుస్తకాలు లభ్యమయ్యేలా చూడాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన సిలబస్ నే TRT లో సిలబస్ గ ప్రవేశ పెట్టాలని కోరుతూ ఓయు జెఎసి ఆధ్వర్యంలో సిఎం కేసిఆర్ దిష్టిబొమ్మను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో కాలబెట్టారు. అలాగే D.El.Ed (డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ )చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు TRT లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓయు జెఎసి నేత కోటూరి మానవత్ రాయ్ నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. రానున్న రోజుల్లో  టిఆర్టీ పోస్టుల సంఖ్య పెంచి సవరణ నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేసి ఈ సర్కారుకు యువత తడాఖా ఏంటో చూపుతామని కోటూరి హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios