తెలంగాణలోని నిరుద్యోగ యువత నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పరీక్షలు రాసి సెలక్టయిన మరికొందరు కోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు నిరుద్యోగులు టీచర్ పోస్టుల కోసం నిర్వహించనున్న టీఆర్టీ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న డైలమాలో ఉన్నారు.ఇలా తెలంగాణలోని నిరుద్యోగ యువత సందేహాలను నివృత్తి చేసే పనిలో పడ్డారు టీఎస్ పిఎస్సి ఛైర్మన్ ఘంటా చక్రపాణి. 

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. నూతనంగా ఏర్పడిన తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చక్రపాణి అన్నారు. త్వరలోనే టీఎస్ పిఎస్సీ ద్వారా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఘంటా తెలిపారు. ఇక టీఆర్టీ పరీక్ష వాయిదా పడుతుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఖచ్చితంగా ఏప్రిల్ లేదా మే నెలలోగా పరీక్షల ప్రక్రియ పూర్తిచేస్తామని  హామీ ఇచ్చారు. వచ్చే జూన్ నాటికి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇక కోర్టు తీర్పు వచ్చిన వెంటనే గ్రూప్- 2 ఉద్యోగాల భర్తీ చేస్తామని చక్రపాణి స్పష్టం చేశారు.