TRS MLC Kalvakuntla Kavitha: రాష్ట్ర రైతులు, ప్రజల అభివృద్దికి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు రైతులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదన్నారు.
Telangana: తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్రస్తుతం మాటల యుద్దం కొనసాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి నిరుద్యోగిత రేటుతో దేశ ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపుతూ ప్రధాని నరేంద్ర మోడీపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశం పురోగతి వెనక్కివెళ్తున్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారనీ, బీజేపీ రైతులకు చేసిందేమీ లేదన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌లు సిండికేట్‌గా పనిచేసి రైతుల ప్రాథమిక హక్కులను హరించేలా పని చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర రైతులు, ప్రజల అభివృద్దికి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు రైతులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర రైతులు, ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండగా పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన రూ. 3000 కోట్ల విలువైన ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్‌ల బకాయిలు, రూ. 1350 కోట్ల వెనుకబడిన ప్రాంత గ్రాంట్ల బకాయిలు, రూ. 2247 కోట్ల జీఎస్‌టీ పరిహారాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంతోని టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఇది గుర్తించి చేసిన నీతి ఆయోగ్ సిఫార్సులను పట్టించుకోలేదని ఆమె కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదనీ, ఈ తీరు వైఖరికి కేంద్రం వద్ద సమాధానం లేదని ఆమె అన్నారు. ప్రధాని మోడీ సర్కారు ఒక్క ఐఐఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలను తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్షను చూపుతున్నదని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పైన కూడా కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల మనోభావాలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ (INC) “వరంగల్ డిక్లరేషన్” అబద్ధాల పేపర్ అని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతులకు చేసిన వాగ్దానాల్లో ఎన్ని అమలు చేశాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాజకీయ మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రాన్ని సందర్శించే జాతీయ నాయకులను “రాజకీయ పర్యాటకులు” అని ఎమ్మెల్సీ కవిత సంబోధించారు. రైతులకు అడుగడుగునా అండగా ఉండి తెలంగాణ రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే రూ.50 వేల కోట్లను బదిలీ చేసింది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని ఆమె అన్నారు.
