తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. దాదాపు 54 రోజులపాటు కార్మికులు సమ్మె చేపట్టగా.... నేటి నుంచి కార్మికులు విధుల్లోకి చేరారు. తీవ్ర నిరాశా నిస్పృహలు, ఆవేదన గూడు కట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. బేషరతుగా ఉద్యోగాల్లో చేరవచ్చని స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం మొదటి గంటలోనే ఎవరి ఉద్యోగంలో వారు చేరి మంచిగా బతకాలని ఆకాంక్షించారు. 

ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్‌ కోర్టుకు పంపగలదని, అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్లు ఇస్తున్నానని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే, ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలను కిలోమీటరుకు ఏకంగా 20 పైసల చొప్పున పెంచేశారు. సోమవారం నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా, అవమానించినా భరిస్తూ కష్టకాలంలో పని చేశారని, భవిష్యత్తులో తప్పకుండా మీ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం విధుల్లోకి చేరారు. ఈ రోజు ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు యధాతథంగా తిరుగుతున్నాయి. ఇన్నిరోజులు ప్రయాణికులు బస్సులు సరిగా లేక ఇబ్బంది పడగా.. నేటి నుంచి ఆ సమస్య తీరింది. ఎప్పటిలాగానే సమయానికి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి.