మేనమామ చేతుల్లో నుంచి జారి కింద పడి ఓ 14 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తగూడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  సైబర్ టవర్స్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి... తన 14 నెలల మేనల్లుడిని ఎత్తుకొని... కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వెళ్తున్నాడు. ఆదివారం ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు కొనుగోలు  చేయడానికి వచ్చిన అతను... పని అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.

అతని వెంట చిన్నారి తండ్రి కూడా ఉన్నాడు. వారు నడుచుకుంటూ వెళ్తుండగా.... చిన్న(20) అనే వ్యక్తి ద్విచక్రవాహనం నడుపుతూ వచ్చి... ప్రమాదవశాత్తు రాజ్ కుమార్ ని ఢీకొట్టాడు. దీంతో.. రాజ్ కుమార్ అదుపు తప్పి... కింద పడిపోయాడు. ఈ క్రమంలో తన చేతిలోని చిన్నారి కూడా కిందపడిపోయాడు. దీంతో... బాలుడి తలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. దీంతో.. తలకు గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది.

వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. రాజ్ కుమార్ కి కూడా స్వల్పగాయాలయ్యాయి. చిన్నారి మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాదాపూర్ కి చెందిన చిన్నాగా గుర్తించారు. కాగా... చిన్నారి మృతి పట్ల అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.