హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇనాంగూడ వద్ద రోడ్డుపై వరద నీరు పోటెత్తింది. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మూడు రోజులుగా వర్షం ప్రజలను ఇబ్బందికి గురి చేస్తోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ వద్ద ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఇది తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది.

దీని ప్రభావంతో ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక తెలంగాణలోని  హైద్రాబాద్ తో పాటు పలు జిల్లాల్లో దీని ప్రభావం కన్పిస్తోందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.

ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడ రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

రెడ్ అలెర్ట్ ను అధికారులు ప్రకటించారు. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.  సికింద్రాబాద్, బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ ,అల్వాల్, తిరుమలగిరిలో భారీ వర్షం కురిసింది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

కొన్ని చోట్ల 20 సెంమీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైద్రాబాద్ తో పాటు సిద్దిపేట, జనగామ, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగరి,సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణశాఖాధికారులు.

ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.