Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ టీచర్ అభ్యర్థుల తాజా డిమాండ్ ఇదే

  • టిఎస్పిఎస్సీపై రగిలిపోతున్న టీచర్ అభ్యర్థులు
  • దేశంలోనే నెంబర్ 1 అంటే గిదేనా అని ఆగ్రహం
  • ధనిక రాష్ట్రంలో పోస్టుల భర్తీ ఇలాగే చేస్తారా అని విస్మయం
  • డిఎస్సీ తరహాలోనే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
  • కాలయాపన చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక
Telangana teacher aspirants want revival of old dsc system

తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 3లక్షలకు పైగా బిఇడి, డిఇడి చదివి టెట్ అర్హత సాధించి ఉద్యోగం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్నచూపుతో ఉంది. తెలంగాణలో ఏర్పాటైన తొలి టిఆర్ఎస్ సర్కారు మూడేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అదేమంటే రోజుకో రకమైన కహానీ చెబుతున్నారు.

ముందుగా ఇప్పుడే కొత్త రాష్ట్రం వచ్చిందన్నారు. తర్వాత లీగల్ సమస్యలన్నారు. జోనల్ సమస్యలన్నారు.. ఏకీకృత సర్వీసు రూల్స్ అడ్డమన్నారు. అంతా అయిపోయిన తర్వాత జిల్లాల విభజన పేరు చెప్పారు. అది కూడా అయిపోయిన తర్వాత టిఎస్పిఎస్సీ వేసిన గురుకుల టీచర్ పోస్టులు తుస్సుమన్నాయి. కోల్డ్ స్టోరేజీకి నెట్టబడ్డాయి. దీంతో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. టీచర్ పోస్టుల కోసం అభ్యర్థులు ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చి కష్టపడి చదువుతున్నారు. కానీ సర్కారు చిత్తశుద్ధి లోపం ఆ నిరుద్యోగులకు శాపంగా మారుతున్నది.

 

  • ఇది ఒక మహిళా అభ్యర్థి ఆవేదన

నేను పిజి, బిఇడి చేశాను. టెట్ అర్హత సాధించాను. మాది నల్లగొండ జిల్లా. నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు 3వ తరగతి, 1వ తరగతి చదువుతున్నారు. గురుకుల పోస్టులు భారీగా వేశారు కదా అని నేను హైదరాబాద్ వచ్చి రామయ్య కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నాను. ప్రిలిమ్స్ లో అర్హత సాధించాను. 20వేలు ఫీజు చెల్లించాను. జులై పదో తారీఖు వరకు కోచింగ్ నడిచింది. తర్వాత ఇంటికి పోయిన. ఇంటిదగ్గర చదువుదామని తీరా జులై 21 తారీఖునాడు మెయిన్స్ పరీక్ష కోసం పట్నం వద్దామనుకుంటే పరీక్ష వాయిదా పడ్డదన్నారు. రెండు నెలల పాటు పిల్లలు ఇబ్బంది పడ్డారు. వాళ్లను చూసుకోలేక మా అమ్మవాళ్లకు అవస్థలు తప్పలేదు. నేను హైదరాబాద్ లో మరో 20వేల వరకు హాస్టల్ పీజు, తీరా పరీక్ష రాద్దామనుకునే సరికి వాయిదా వేయడంతో ఏం చేయాలో తెలియడంలేదు. నావల్ల మా ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఇబ్బందులపాలయ్యారు. 60వేలకు పైగా ఖర్చు అయ్యాయి. ఇప్పుడేం చేయాలో తెలియడంలేదు.

ఈమె ఒక్కరే కాదు ఇలాంటి వాళ్లు వేలు, లక్షల సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు. ఇది అందరు నిరుద్యోగుల ఆవేదన. దేశంలోనే నెంబర్ 1 సిఎం, దేశంలోనే ధనిక రాష్ట్రాల జాబితాలో ఉన్న తెలంగాణలో, దేశంలోనే నెంబర్ 1 పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉన్న చోట లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇలా బాధలు అనుభవించడం పట్ల వారు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.

టిఎస్పిఎస్సి తీరు పట్ల టీచర్ అభ్యర్థులు తీవ్రమైన ఆందోళన, ఆగ్రహంతో ఉన్నారు. తలాతోక లేని నిబంధనలు పెట్టడం, తర్వాత వాటిని సవరించుకోవడం ఆ తర్వాత అదీకాక కోర్టులో మొట్టికాయలు తినడం తప్ప టిఎస్పిఎస్సీ చేసిందేమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టిఎస్సిఎస్సీని పక్కన పెట్టి పాత పద్ధతి అయిన డిఎస్సీ ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

తెలంగాణ సర్కారు 2016లో డిఎస్సీ ద్వారా కాకుండా టీచర్ పోస్టుల భర్తీని టిఎస్పిఎస్సీకి అప్పగిస్తూ జిఓ విడుదల చేసింది. ఆ జిఓ రద్దు చేయాలని పాత డిఎస్సీ ద్వారానే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ మూడు పరీక్షలు కాకుండా ఒకే పరీక్ష నిర్వహించాలంటున్నారు. టీచర్ పోస్టులన్నింటినీ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు అప్పగిస్తూ ఇచ్చిన జిఓను రద్దు చేసి తిరిగి ఆ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios