టిడిపి అధినేత చంద్రబాబుకు ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనే షాక్ ఇచ్చేందుకు తెలంగాణ తమ్ముళ్లు భారీ స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అంతటి అవసరం ఎందుకొచ్చిందని మీకు డౌట్ వచ్చిందా? అయితే చదవండి.

గత కొంతకాలంగా తెలంగాణ టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని తెలంగాణ టిడిపి తమ్ముళ్లు కోరుతున్నారు. ఎపి టిడిపి తమ్ముళ్ల కోరిక కూడా అదే. ఇప్పుడు ఎలాగూ ఎపిలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ సెటిల్ అయిపోయారు కాబట్టి తెలంగాణలో టిడిపిని గాడిలో పెట్టాలంటే ఎన్టీఆర్ రక్తసంబంధీకులే రావాలని క్యాడర్ కోరుతున్నారు. ఒక దశలో నారా బ్రాహ్మణిని రంగంలోకి దింపాలని వత్తిడి తెచ్చారు. కానీ ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో ఇక జూనియర్ ను బరిలోకి దింపాలన్న డిమాండ్ రోజురోజుకూ తెలంగాణ తమ్ముళ్లలో పెరిగిపోతున్నది.

ఇక సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఒక టిడిపి కార్యకర్త, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మరో కార్యకర్త ఇద్దరూ ఏకంగా ఒక అడుగు ముందుకేసి జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ టిడిపి అధినేతగా ప్రకటించాలంటూ ఏకంగా ఎన్టీఆర్ భవన్ లోనే ధర్నా చేపడతాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తాను చేపట్టబోయే ధర్నాకు టిడిపి శ్రేణులంతా మద్దతివ్వాలని కోరారు. ఈమేరకు వారు తయారు చేసిన ఒక పోస్టర్ టిడిపి సోషల్ మీడియా వర్గాల్లో జోరుగా సర్కులేట్ అవుతోంది.

ఇంకో కీలకమైన విషయం ఏమంటే ఈనెల 28వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. ఆయన తెలంగాణ టిడిపి నేతలతో ఆరోజు సమావేశం అవుతారు. ఈ పరిస్థితుల్లో అదేరోజు బాబు రాక సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం ధర్నా చేస్తామని ప్రకటించడం టిడిపి వర్గాలను వేడెక్కిస్తోంది.

చూడాలి. ఈనెల 28న ఏం జరగబోతుందా అన్నది. పార్టీ వర్గాలలో మత్రం టెన్షన్ నెలకొంది.