టిడిపికి మరో షాక్

First Published 21, Dec 2017, 3:03 PM IST
Telangana TDP MP Devender Goud to switch over to Congress
Highlights
  • కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమేనా?
  • కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ

తెలంగాణ టిడిపికి మరో భారీ షాక్ తగలనుందా? తెలంగాణ టిడిపిలో కీలక నేతగా ఉన్న టి. దేవేందర్ గౌడ్ పార్టీ వీడే చాన్స్ ఉందా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దేవేందర్ గౌడ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2018 ఏప్రిల్ వరకు ఆయన రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ మార్పుపై చర్చలు ఊపందుకున్నాయి. 

దేవేందర్ గౌడ్ తనయుడు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోశిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షడిగా కొనసాగుతున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రోజురోజుకూ బలహీనపడిపోతున్నది. ఇప్పటికే ఆ పార్టీకి బలంగా ఉన్న నేతలంతా అటు కాంగ్రెస్, ఇటు టిఆర్ఎస్ బాట పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేసిఆర్ కు బద్ధ వ్యతిరేకిగా ఉన్న దేవేందర్ గౌడ్ కుటుంబం కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నట్లు రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతల్లో చర్చలు జోరందుకున్నాయి.

దేవేందర్ గౌడ్ గత కొంతకాలంగా కారణాలేమైనా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొడుకు వీరేందర్ సీరియస్ పాలిటిక్స్ లో ఉన్నారు. దీంతో దేవేందర్ గౌడ్ తన కొడుకు భవిష్యత్తు విషయంలోనే పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారన్న వాదన ఉంది. అయితే దేవేందర్ గౌడ్ ప్రస్తుతం ఎంపిగా ఉన్నారు. మరో నాలుగు నెలలు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్తారా? లేక ఏప్రిల్ తర్వాత పోతారా అన్నది ఇంకా తేలలేదు.

ఒకవేళ మాజీ పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ ఫార్ములా ప్రయోగించినా ఆశ్చర్యం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం డిశ్రీనివాస్ టిఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా ఉండగా... ఆయన కొడుకు అర్వింద్ బిజెపిలో చేరి తెలంగాణ సర్కారుపై పోరాటం చేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపైనా డిఎస్ బిజెపిలోకి చేరొచ్చన్న చర్చ ఉంది. అదే తరహాలో ముందుగా వీరేందర్ కాంగ్రెస్ లో చేరి.. ఆ తర్వాత మెల్లగా దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరొచ్చన్న చర్చ కూడా ఉంది. అయితే కొడుకు పార్టీ మారుతాడో లేదో తెలియదు కానీ.. దేవేందర్ గౌడ్ పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన సన్నిహితుడు ఒకరు ఏషియానెట్ తో స్పష్టం చేశారు. 

గతంలో దేవేందర్ గౌడ్ టిడిపిలో నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. కానీ ఆయన టిడిపిని వీడి నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టిపిపి ) పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు. కానీ పార్టీ నడపలేక  చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంతో కలిసి నడిచారు. తుదకు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టిడిపిలో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు పోతాడన్న ప్రచారం ఊపందుకున్నది. 

loader