తెలంగాణ రాజకీయాల్లో సిఎం కేసిఆర్ ఎప్పుడు ఎటు టర్న్ తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కదు. ఆయన టార్గెట్ ఒకవైపు ఉంటే బాణం ఇంకోవైపు వేస్తాడు. అంతిమంగా అందరినీ గందరగోళంలో పడేసి సునాయాసంగా విజయం సాధిస్తాడు. ఒక్కసారి కేసిఆర్ స్కెచ్ వేసిండంటే ఎంతటి తలపండిన రాజకీయ నేత అయినా వలలో చిక్కాల్సిందే.

కాకలు తీరిన కాంగ్రెస్ అధిష్టానమే కేసిఆర్ వేసిన వలలో చిక్కి విలవిలలాడిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ముగ్గులోకి దింపి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించారు కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో కేసిఆర్ కు తిరుగే లేని వాతావరణం ఉంది. కానీ కేసిఆర్ కు ఎక్కడో ఆవగింజంత అలజడి మాత్రం ఉంది. ఆ భయంతోనే కేసిఆర్ మరింత బలోపేతం కావడమెలా అన్నదానిపై వ్యూహాలు రచిస్తున్నారు.

అందులో భాగంగానే పరిటాల శ్రీరాం వివాహానికి అనంతపురం వెళ్లారు కేసిఆర్. ప్రత్యేక విమానం, హెలిక్యాప్టర్ వాడుకుని మరీ వివాహానికి హాజరయ్యారు. ఆయన వెంట గతంలో టిడిపిలో పనిచేసిన తుమ్మల, ఎర్రబెల్లిని పట్కపోయారు. అనంతపురం వెళ్లి పెళ్లికి హాజరుకావాల్సినంత ఫ్రెండ్ షిప్ కేసిఆర్ కు, పరిటాల ఫ్యామిలికి ఉందా అంటే అంత సీన్ లేదని చెబుతున్నారు టిడిపి నేతలు.

ఇక కేసిఆర్ అనంత పర్యటన మొదలుకొని తెలంగాణలో రేవంత్, మోత్కుపల్లి మాటల వరకు అన్ని అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు వద్ద ఆదివారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ లోని బాబు నివాసంలో తెలంగాణ టిడిపి నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో జరిగిన చర్చల సారాంశం ఇది.

సమావేశంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు మీద  మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి బాబుకు ఫిర్యాదు చేశారు. అవసరమైతే టిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని మోత్కుపల్లి కామెంట్ చేయడాన్ని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మనది అయినప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోవడాన్ని కేడర్ ఎలా జీర్ణించుకుంటారని మోత్కుపల్లి ఈ సందర్భంగా అభ్యంతరం తెలిపారు. అయితే ఎన్నికల పొత్తలపై పార్టీ నేతలెవరూ నోరు విప్పరాదని చంద్రబాబు గట్టిగానే క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నాటికి పొత్తులు, ఎన్నికల స్నేహాలపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు.

ఇక సమావేశంలో రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇద్దరు కూడా ఎపి టిడిపి నేతలపై బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతపురంలో పరిటాల వివాహం సమయంలో ఎపి టిడిపి నేతలు కేసిఆర్ తో రాసుకుపూసుకు తిరిగేందుకు ఆరాటపడ్డారని అంతగా ఎందుకు అత్యుత్సాహం చూపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేసిఆర్ ను ఎన్నడూ చూడనట్లు ఆయనతో షేక్ హ్యాండ్ లు ఇవ్వడం కోసం ఆరాటపడడం ఏమాత్రం బాగాలేదని ఫిర్యాదు చేశారు. ఎపి టిడిపి నేతలకు కేసిఆర్ తో షేక్ హ్యండ్ ఇచ్చేందుకు పోటీ పడితే అక్కడ ఏమైనా నాలుగు ఓట్లు ఎక్కువొస్తాయా అని గట్టిగానే అడిగారు.

ఈ విషయంలో ఇంకా లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. అసలు కేసిఆర్ అనంతపురం పెళ్లికి రావడానికి కేవలం పరిటాల కుటుంబానితో ఉన్న స్నేహమేనా? లేక వేరే రాజకీయ ఉద్దేశం ఉందా అన్న కోణంలో కూలంకషంగా చర్చించారు. అయితే కేసిఆర్ అక్కడ వ్యవహరించిన తీరు చూస్తే నూటికి నూరుశాతం రాజకీయ దురుద్దేశంతోనే అక్కడ డ్రామా క్రియేట్ చేశారని తెలంగాణ నేతలు బాబుకు వివరించారు. తెలంగాణలో కేసిఆర్ ఎంత గింజుకున్నా కేడర్ మాత్రం టిడిపితోనే ఉందని, ఆ కేడర్ ను రాబట్టలేక కేసిఆర్ ఇలాంటి పిల్లి మొగ్గలు వేస్తున్నారని నేతలు వివరించారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా బలంగా ఉన్న టిడిపి కేడర్ ను గందరగోళంలోకి నెట్టి లబ్ధిపొందాలన్న దుర్బుద్ధితో కేసిఆర్ పన్నిన వలలో మనం చిక్కుతున్నామని హెచ్చరించారు.

ఈ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ అందుకే ఒకరు కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అని, ఇంకొకరు టిఆర్ఎస్ తో పొత్తు అని మాట్లాడితే కేడర్ మరింత గందగోళంలో పడిపోతారని అన్నట్లు తెలిసింది. కాబట్టి ఎన్నికల నాటి వరకు మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. పొత్తుల గురించి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై పార్టీల పొత్తుల గురించి మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే టిఆర్ఎస్ తో పొత్తు ఉండబోదన్న సంకేతాలు మాత్రం బాబు నోట రాలేదని తెలంగాణ టిడిపిలోని ఒక వర్గం గుర్రుగా ఉంది. రకరకాల ఈక్వేషన్లను చూస్తే కేసిఆర్ తో వైరం పెట్టుకోవాలన్న ఉద్దేశం బాబులో కనిపించలేదన్నట్లు చెబుతున్నారు.

అయితే ఎన్నికల వరకు పొత్తుల గురించి కామెంట్లు చేయరాదన్న బాబు ఆదేశాలను తెలంగాణ టిడిపి నేతలు ఏమేరకు పాటిస్తారన్నది అనుమానమే. ఎందుకంటే ఒకవేళ తెలంగాణలో టిఆర్ఎస్ తో పొత్తు అంటూ ఉంటే ఇప్పుడున్న టిడిపి నేతల్లో డజనుకు పైగా నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది. కేసిఆర్ పట్ల తీవ్రమైన వ్యతిరేక భావన ఉన్న నాయకులంతా పొత్తు అంటే వెళ్లిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు అంటే ఇంకో వర్గం వారు కూడా టిడిపిలో ఉంటారా అన్న అనుమానం ఉంది. పొత్తులేమీ లేకుండా ఒంటరిగా పోదామంటే ఎన్ని సీట్లలో గెలుస్తామో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లోనే తెలంగాణ టిడిపిలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు పార్టీలోని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.