హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భేటీపై తెలంగాణ తమ్ముళ్లు కూడా విరుచుకుపడ్డారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు విమర్శలు గుప్పిస్తుండగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. 

కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త రాజకీయాలకు తెర తీశారని తెలంగాణ టీడీపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. దేశంలోనే అతి పెద్ద అవినీతిపరుడు జగన్ అని ఉద్యమ కాలంలో కేటీఆర్ వ్యాఖ్యానించారని, ఇప్పుడు జగన్ తో దోస్తీ కడుతున్నారని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో బిజెపికి వైసిపి, టీఆర్ఎస్ బీ టీమ్ లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. 

వైఎస్‌ కుటుంబాన్ని ఎప్పుడూ విమర్శించే సీఎం కేసీఆర్‌కు‌ ప్రతిపక్ష నేత జగన్‌ దోస్త్‌ ఎలా అయ్యారని రమణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అన్నారు. ఇన్ని రోజులుగా దాచుకున్న ముసుగు నేటితో తొలగిపోయిందని రమణ అన్నారు. 


కేసీఆర్ తన కుటుంబ రాజకీయ మనుగడకోసమే ఇదంతా చేస్తున్నారని, దేశంలోనే అతిపెద్ద లంచగొండి జగన్‌ అని గతంలో కేసీఆర్‌ ఆరోపించారని గుర్తుచేశారు. నీతి గురించి జగన్‌కు మాట్లాడే అర్హత లేదన్న కేటీఆర్ ఇవాళ ఎలా కలిశారని ఆయన అడిగారు.

బిజెపి నాయకత్వంలో టీఆర్ఎస్, వైసిపి, మజ్లీస్ పనిచేస్తున్నాయని తెలంగాణ టీడీపి మరో నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్, జగన్ ల భేటీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలతో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇవాళ అమరవీరులను మరిచిపోయారని ఆయన అన్నారు. 

ఎపిని కొల్లగొట్టి జగన్ కు అప్పగించారని గతంలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు జగన్ ఫ్యాన్ కు ఫిదా అయ్యారని రావుల అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా చేయనన్ని విమర్శలు టీఆర్ఎస్ జగన్ పై చేసిందని ఆయన అన్నారు.