నిజామాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి డిపాజిట్ కూడా దక్కించుకోని నేపథ్యంలో చంద్రబాబుకు ఇది కూడా ఓ దెబ్బనే. 

మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను శనివారం చంద్రబాబుకు పంపించారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె తన లేఖలో తెలిపారు. 

కాగా, అన్నపూర్ణమ్మ బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె తన కుమారుడు మల్లికార్జున్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం బిజెపిలో చేరుతారు. 

నిజామాబాద్ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా పేరు గాంచిన అన్నపూర్ణ 1994, 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ మనుగడ అసాధ్యమైన స్తితిలో ఆమె 2018 ఎ్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తాను టీడీపీకి చెందిన అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.