నూతన సంవత్సరం రోజున తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది.  కాగా.. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రంలో సంబరాలు చేసుకోవడానికి లేదని.. ఈ వెంట్స్ నిర్వహించడానికి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. మద్యం తాగి.. రోడ్డుపై తిరిగినా.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా మందుబాబులు రోడ్లపై చక్కర్లు కొట్టారు.

దాదాపు కరోనా దేశంలో వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన తర్వాత.. డ్రంక్ డ్రైవ్ టెస్టులను దాదాపు ఆపేశారు. బ్రీత్ ఎనలైజర్ కారణంగా కరోనా వ్యాపించే అవకాశం ఉందని కాస్త వెనక్కి తగ్గారు. అయితే.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.

కాగా.. కేవలం తెలంగాణలో 1814 మంది మద్యం తాగి.. వాహనాలు నడుపుతూ.. పోలీసులకు చిక్కారు. వారిలో పలువురు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా..  చిక్కడపల్లిలో.. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడుపుతూ.. ఓ వ్యక్తి ని ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు.
శ్రీవాస్తవ(21) అనే వ్యక్తి వేగంగా కారు నడుపుతూ వచ్చి నాగిరెడ్డి(60) అనే కూరగాయల వ్యాపారిని ఢీ కొట్టాడు. అయితే.. వారిద్దరూ మద్యం తాగి ఉండటం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా.. గచ్చిబౌలి, నార్సింగ్, మాదాపూర్, రాయదుర్గం, కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో నమోదయ్యాయి. అంతేకాకుండా.. 367 ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి.