Asianet News TeluguAsianet News Telugu

సోనియా ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ సాధ్యమైంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీతోనే సాధ్యమైందని, రాజకీయంగా పార్టీ నష్టపోతుందని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్‌ను కాంగ్రెస్ నిలిపిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.

telangana state formed by congress chief sonia gandhi says tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published Aug 9, 2021, 3:36 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువకుల ఆత్మబలిదానాలకు ఆమె చలించిపోయారని చెప్పారు. అందుకే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని వివరించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

దేశ స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని, దేశానికే స్వాతంత్ర్యం తీసుకువచ్చి భారతీయులకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం అధికారాన్ని చేపట్టి ప్రపంచదేశాల ముందు భారత్‌ను శక్తివంతమైన దేశంగా నిలబెట్టిందని అన్నారు. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్నదని విరుచుకుపడ్డారు. దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టిందని ఆరోపణలు చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి మోడీ రైతుల వెన్నువిరుస్తున్నారన్నారు. అలాగే, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ పౌరుల జేబుకు చిల్లుపెడుతున్నారని మండిపడ్డారు.

ప్రధానమంత్రి మోడీతోపాటు సీఎం కేసీఆర్‌పైనా రేవంత్ నిప్పులు చెరిగారు. వీరిరువురూ తెల్లదొరల ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విధానాలను ప్రతి ఒక్క పౌరుడూ వ్యతిరేకించాలని, అది వారి బాధ్యత అని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కలలు సాకారం కావాలని, వారి ఆశయాలు నెరవేరాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వివరించారు. కానీ, కేసీఆర్ పాలనలో అణగారిన ప్రజల ఆశయాలు అమలు కావడం లేదని తెలిపారు. అందుకే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో గద్దె దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ కొనసాగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని చెబుతూ టీఆర్ఎస్‌కు మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీజేపీకి కౌంటర్ ఇచ్చినట్టయింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రోజే తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్‌తో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మ తల్లి అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios