హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ -వోటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కరోనాతో క్వారంటైన్ లో ఉన్నవారితో పాటు వృద్దులు ఈ విధానం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే వెసులుబాటు దక్కనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.ఎన్నికల నిర్వహణ విషయమై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో ఓటు హక్కును వినియోగించుకొనే విషయమై ఐటీ శాఖ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు సమావేశం నిర్వహించింది. ఆన్ లైన్ లో ఓటు హక్కును నిర్వహించుకొనేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ ను తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఐటీ శాఖాధికారులను కోరారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఓటర్ల జాబితా తయారీకి రంగం సిద్ధం

జీహెచ్ఎంసీలో  ఈ ప్రయోగం సక్సెస్ అయితే  త్వరలో జరిగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఆన్ లైన్ లో ఓటింగ్ విధానాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరోనాతో క్వారంటైన్ లో ఉన్నవారితో పాటు వృద్దులకు ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. ఆన్ లైన్ లో ఓటింగ్ విధానానికి అవసరమైన సాఫ్ట్ వేర్ రెడీ అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయడం ఇదే ప్రథమం కానుంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నాలను మొదలు పెట్టాయి.