Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ ముహూర్తం ఫిక్స్..! ఆ రెండు గ్యారెంటీలకు ఆమోదం లభించేనా.?
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు పథకాల అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అమలు చేయనున్న పలు పథకాలపై కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారు.
Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు పథకాల అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా చర్చ జరగనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు పథకాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
తాజాగా రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అతి త్వరలో అమలు చేయాలని, వాటి కార్యచరణపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ఈ రెండు స్కీమ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కేబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యంతరం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది. ఈ భేటీలో బడ్జెట్ ఎజెండాపై కూడా చర్చ జరిగనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత ఎజెండా అంశాల సమగ్ర జాబితాను, మంత్రుల పరిశీలన కోసం క్యాబినెట్ మెమోరాండాలను సమర్పించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అమలు చేయనున్న పలు పథకాలపై కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారు.