కేసిఆర్ దుమ్ము దులిపిన కోదండరాం

Telangana state achieved for people not for KCRs family
Highlights

  • మీ కుటుంబం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది
  • మీ ఇసుక కాంటాక్టుల కోసం అసలే కాదు
  • 2వేల మందిని అరెస్టు చేశారు
  • 15వేల మందిని రాకుండా అడ్డుకున్నారు
  • యువత ఉద్యోగాలను ఫణంగా పెట్టి కాంటాక్టులు
  • క్యాలెండర్ వచ్చే వరకు పోరాటం ఆగదు

కొలువులకై కొట్లాట సభ విజయవంతమైంది. హైకోర్టు జోక్యం చేసుకుని తెలంగాణ సర్కారు మెడలు వంచి జెఎసి కొట్లాట సభకు అనుమతి తెచ్చుకున్నది. అడుగడుగునా పోలీసులు ఆటంకాలు కల్పించినా యువత పెద్ద ఎత్తున సరూర్ నగర్ స్టేడియం చేరుకున్నది. ఉద్యోగాల కోసం నినదించింది. కొట్లాట సభ ఇటువైపు జరుగుతుండగానే మరోవైపు ఇద్దరు యువకులు ఆత్మబలిదానం చేసుకోవడం యువతను కల్లోలానికి గురిచేసింది. ఉస్మానియాలో మురళి, నిర్మల్ లో భూమేష్ లు ఆత్మబలిదానం చేసుకున్నారు భూమేష్ ఎమ్మెస్సీ బిఇడి చదివాడు. ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొలువులకై కొట్లాట సభలో అన్ని అంశాలను తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం వివరించారు. సర్కారు తీరును ఎండగట్టారు. కొట్లాట సభలో కోదండరాం మాట్లాడిన మాటలను యదాతదంగా ఏషియానెట్ అందిస్తున్నది.

డిసెంబరు 4 కోసం ఎన్నిరోజులుగా ఎదురుచూసినం. ఫిబ్రవరి నుంచి ఎదురుచూసినం. మన కార్యక్రమానికి అనుమతివ్వలేదు. ఇంటిమీద పడి తలుపులు పలగ్గొట్టి అరెస్టులు చేసిర్రు. అక్టోబరు 30నే కొట్లాట సభ అనుకున్నం. దరఖాస్తు పెట్టినం. అయినా సమాధానం రాలేదు. తర్వాత నవంబరు 30 కోసం దరఖాస్తు పెట్టినం. అయినా సమాధానం రాలేదు. మనం ఈ పక్క దరఖాస్తులు పెడుతుంటే.. ఆ పక్క సన్ బర్న్ కార్యక్రమానికి అనుమతించారు. అక్కడ పాటలేకాదు మందు, మసాలా కూడా ఉంటది.

ఎంతో కష్టపడి కొట్లాడి కొట్లాడి కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నం. పర్మిషన్ తెచ్చుకున్నా ఇండ్ల మీద పడి అరెస్టులు చేసిన్రు. నిన్న రాత్రి నుంచి 2వేల మందిని అరెస్టు చేసిర్రు. 15వేల మంది ఇక్కడికి రావడానికి ప్రతయ్నాలు చేస్తే అడ్డగించి రాకుండా చేసిర్రు. వాళ్లంతా వస్తే ఈ గ్రౌండ్ సరిపోయేదే కాదు. కొట్లాట సభ ద్వారా శాంతి భద్రతల సమస్య వస్తదని లేనిపోని అపోహలు కల్పించిర్రు. కానీ అనవసరంగా అరెస్టులు చేసి లేని వివాదాలు సృష్టించింది తెలంగాణ సర్కారే.

మేమేం అడిగినం.. మీ కుర్చీలు అడిగినమా? మణులు అడిగినమా మాణిక్యాలు అడిగినమా? మా ఉద్యోగాలు కావాలని అడిగినం. ఉద్యోగ క్యాలెండర్ ఇయ్యమని అడిగినం. అధికారంలోకి రాగానే మన ఉద్యోగాల కోసం మొదటి ఫైలుపై సంతకం చేయాల్సి ఉండే. కానీ ఆ పని కాలేదు. విద్యార్థుల అసహనాన్ని అర్థం చేసుకుని మేమే ఈ పోరాటానికి పిలుపునివ్వాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో నిరుద్యోగ సమస్యపై చర్చలు జరిపినం. ప్రతిపాదనలన్నీ ప్రభుత్వానికి పంపినం. వీటిని పరిశీలించాలని కోరినం.

తెలంగాణలో రెండు లక్షల నుంచి 3లక్షల వరకు ఖాళీలు ఉన్నయని మేము అంకెలు ఇచ్చినం. మేము ఇచ్చిన అంకెలపై, గణాంకాలపై నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కారు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలు. మోసపూరిత లెక్కలు. తక్షణమే ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నీ యదాతదంగా భర్తీ చేయాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్లీ ఇంకోటి ఇవ్వాలి. కేవలం పోలీసు ఉద్యోగాలే వేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ లేదు. వెంటనే ఏజ్ రిలాక్షేషన్ ఇయ్యాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఖాళీలు అవుతున్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి.

భర్తీ చేస్తామన్నాం కదా? ఇంకెందుకు అడుగుతున్నారు అని అంటున్నది ప్రభుత్వం. కొట్లాట సభలెందుకు అని అంటున్నది. కానీ.. క్యాలెండర్ విడుదల చేయకుండా మాకు నమ్మకం కుదరదు మాకు. కచ్చితంగా క్యాలెండర్ కోసం పోరాటం చేస్తాం. సాధించుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనివ్వం అని స్పష్టం చేస్తున్నాం. మేమొస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉండనే ఉండవు అన్న టిఆర్ఎస్ పార్టీ ఇంకా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తూనే ఉన్నది. ఆ నోటిఫికేషన్లు అన్నీ సవరించి మంచి జీతాలతో ఉద్యోగాలు ఇవ్వాలి. అందులో హోంగార్డుల ఇష్యూ  కూడా ఉంది. పోలీసులతో సమానంగా హోంగార్డులకు కూడా జీతాలివ్వాలి.

అందరికీ గవర్నమెంటులో ఉద్యోగాలు దొరకవు. ప్రయివేటు పరిశ్రమలున్నాయి. ఐటి రంగం ఉంది. ఇన్షూరెన్స్ రంగం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. ఇవన్నింటిలో భూమిపుత్రులకే ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకే ఇవ్వాలి.

నిజంగా ప్రయివేటు రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నది. మరి వాటిపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో తెలంగాణవారికి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. చిన్న, సూక్ష్మ కుటీర పరిశ్రమల్లో ఉపాధి పెంపొందించాలి. అన్నిటికంటే మించి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారు ఉపాధి దొరకక పట్టణాలకు వలస పోతున్నారు.  ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేయాలి. వ్యవసాయంలో బతుకుదెరువు లేకపోవడంతో మళ్లీ దుబాయ్ కి వలస పోతున్నారు.

తల్లిదండ్రులపై వత్తిడి పెంచి కోచింగ్ సెంటర్లకు పోతున్నారు. దసరా పండుగకు కూడా విద్యార్థులు సొంతూరికి పోతలేరు. ఇంటికి పోతే కలిసినోళ్లంతా ఏమిరా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నరు. అందుకే మొహం లేక ఊరికి పోలేకపోతున్నం అని విద్యార్థులు అంటున్నరు. మురళి ఆత్మహత్య గురించి విద్యార్థులు మాట్లాడుకుంటున్నరు. అందరి పరిస్థితి అట్లనే ఉందని నిరాశతో ఉన్నరు. యువత నిరాశతో ఉంటే దేశానికే అరిష్టం. ఎట్లైనా ఉన్నత శిఖరాలకు చేరుతానన్న విశ్వాసం కల్పించాలి యువతలో. ఆ విశ్వాసం కల్పించడంలో విఫలమవుతున్నారు. యువత రాత్రింబవళ్లు చదువుతున్నారు. లైబ్రరీల్లో కుర్చీలు వదలకుండా చదువుతున్నారు. గొడ్డు కారం తిని చదువుతున్నారు. కానీ పాలకులు కాంట్రాక్టర్ల మీద చూపిన మోజు, ఇసుక రవాణా మీద చూపిన మోజు నిరుద్యోగుల మీద చూపడంలేదు.

రాజకీయ నిరుద్యోగం అని నన్ను అంటున్నరు. నువ్వు రాజకీయం చేసుకుంటూ నన్ను రాజకీయం చేస్తున్నావని అడిగితే నాకు సిగ్గు అనిపిస్తున్నది. నువ్వు ఆ కుర్చీ దిగి పదవి నుంచి బయటకొచ్చి రాజకీయం చేస్తున్నావని అంటే బాగుంటది. నా ఇష్టానుసారంగా పాలన చేస్తా అంటే కుదరదు. ముఖ్యమంత్రి చాలా మంది మంత్రులకే దొరుకుతలేడు. మనకేం దొరుకుతడు. ఆయనకు ఏమైనా చెబుదామంటే వినడు, చూడడు. సెక్రటేరియట్ కే రాడు. ఇంకేం పాలన చేస్తడు. ఇంకేం యువతకు న్యాయం చేస్తడు.

కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం తెలంగాణ యువత భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడని ఈ వేదిక మీద నుంచి స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. అందరికోసం నువ్వు పనిచేయకపోతే కచ్చితంగా అడుగుతాం. మీ మాదిరిగా రాజకీయంలో ఉండి రాజకీయం చేస్తున్నారని అడగడానికి మేమేమీ తప్పుడు పనులు చేస్తలేము. ఈసమెత్తు కూడా మేము వెనుదిరగం. కొలువులు సాధించుకుంటాం. ఇట్లాంటి కలుషితమైన రాజకీయాలు మారుస్తాం. ఈ సమాజం మాది. భవిష్యత్తు మాది అని యువత అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మన తెలంగాణ. మనం తెచ్చుకున్న తెలంగాణ. మనల్ని తాకట్టు పెట్టినప్పుడు మనం మౌనంగా ఉండాల్సిన పనిలేదు. కచ్చితంగా అడుగుదాం.

ఎట్టి పరిస్థితుల్లో చావు పరిష్కారం కాదు. చావుతో సమస్య పరిష్కారం రాదు. ఐక్యంగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారానే సమస్య పరిష్కారం అయితది. తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం కొలువులు తెచ్చుకునుడు పెద్ద పని కాదు. తదుపరి కార్యాచరణ విఫులంగా చర్చించే అవకాశం రాలేదు. క్యాలెండర్ కోసం గట్టిగా పోరాడతాం. ప్రయివేటు పరిశ్రమల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో స్థానికులకు అవకాశాల కోసం పోరాడతాం. ఈ రాజకీయాలు ఇట్లా జరగడానికి వీల్లేదని చాటిచెప్పుదాం.

మీ ఒక్క కుటుంబం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది. మీ కుటుంబ పాలన కోంస అంతకంటే కాదు. యావన్మంది కోసం తెలంగాణ తెచ్చుకున్నం. మీ ఇసుక కాంట్రాక్టుల కోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఐకెపి ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడొద్దా? గురుకుల టీచర్లు టిఫిన్ తింటుంటే టిఫిన్ పక్కన పడేసి అరెస్టు చేసిర్రు. సింగరేణి ఉద్యోగులకు దసరాకు ఓటేయండి. దీపావళికి ఉద్యోగాలు తీసుకుపోండి అన్నారు. దసరా, దీపావళి పోయి సంక్రాంతి వస్తున్నది. ఇచ్చిర్రా?

ఉద్యోగాలు సాధించాలన్న ఆకాంక్ష మాలో బలంగా ఉన్నది. నవ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలన్న ఆకాంక్ష మాలో ఉన్నది. మా ఆకాంక్ష ఎంత బలంగా ఉందంటే మేం ప్రపంచాన్నే జయించగలం. ఈ సభను విజయవంతం చేసిన ఘనత తెలంగాణ విద్యార్థులదే. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

loader