Asianet News TeluguAsianet News Telugu

ఆస్తులకు నో, బ్యాంక్ డిపాజిట్ల పంపకానికి ఒకే.. విభజన సమస్యలపై తెలంగాణ స్టాండ్ క్లియర్..!

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 8 ఏళ్లు గడిచిన.. ఏపీ, తెలంగాణల మధ్య పలు విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. అయితే రేపు (నవంబర్ 23)న తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. 

Telangana stands on share bank deposits of common institutions with Andhra Pradesh says Reports
Author
First Published Nov 22, 2022, 10:08 AM IST

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 8 ఏళ్లు గడిచిన.. ఏపీ, తెలంగాణల మధ్య పలు విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆస్తులు విభజన, ఇతర వివాదాల పరిష్కారానికి పలుమార్లు సమావేశాలు జరిగిన.. ఇంకా పలు వివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే రేపు (నవంబర్ 23)న తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9,10 లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల ఆస్తులను పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. దానిని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. జనాభా నిష్పత్తిలో 52:48 నిష్పత్తిలో ఈ సంస్థల బ్యాంకు డిపాజిట్లను మాత్రమే పంచుకునేందుకు తెలంగాణ అంగీకరించింది. సింగరేణి కాలరీస్ అండ్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో వాటా కోరుతూ ఏపీ ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో బుధవారం కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఆర్థిక, ఇంధనం, పౌర సరఫరాలు, రవాణా, రోడ్లు, భవనాలు, సింగరేణి నుంచి సీనియర్ అధికారుల ప్రతినిధి బృందంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హాజరుకానున్నారు. 

అయితే మూలధనం కింద సుమారు రూ.1,51,349 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల కింద రూ.28,099 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ.4,474 కోట్లు, సస్పెన్స్, ఇతరత్రా కింద రూ.238 కోట్లు, ఈ సంస్థల రెమిటెన్స్ కింద రూ.310 కోట్లు టీఎస్, ఏపీ మధ్య ఇంకా పంచాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్10 క్రింద 142 సంస్థలు జాబితా చేయబడ్డాయి. అయితే ఇవి ఎక్కువగా హైదరాబాద్‌లో ఉన్నాయి. షెడ్యూల్ 9 కింద మరో 91 సంస్థలు ఉన్నాయి.ఈ సంస్థలన్నింటికీ కలిపి భవనాలు, భూములు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే వీటిపై రెండు ప్రభుత్వాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. 

ఇక, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనని మరో 12 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలను షెడ్యూల్ 9, 10 లో పేర్కొన్న సంస్థలతో పాటుగా విభజించాలని డిమాండ్ చేస్తోంది. అయితే అది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడమేనని తెలంగాణ వాదిస్తోంది. ఇది మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని, విభజన ప్రక్రియ ఎప్పటికీ ముగియదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios