Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్ - కేసీఆర్ చిత్రపటం రెపరెపలు, కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త వివాదం

కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. అయితే వేదిక వద్ద తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి చేసిన ఓవరాక్షన్ వార్తల్లోకెక్కింది

Telangana Sports Authority Chairman waves photo of CM instead of Nikhat Zareen when she won gold medal
Author
Birmingham, First Published Aug 7, 2022, 9:52 PM IST

ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ నెగ్గిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (nikhat zareen) కామన్వెల్త్ క్రీడలలోనూ (commonwealth games ) స్వర్ణం  గెలిచింది.  ఆదివారం బాక్సింగ్ ఫైనల్స్ లో  ‘స్వర్ణ కాంతులు’ విరబూయిస్తున్న బాక్సర్ల జోరుకు మరింత హంగులు అద్దుతూ జరీన్ బంగారు పతకం సాధించింది. మహిళల  లైట్  ఫ్లైయిట్  50 కిలలో విభాగంలో  నిఖత్.. నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నాల్ మీద గెలిచింది. ఫైనల్ బౌట్ లో మన నిజామాబాద్ అమ్మాయి.. 5-0 తేడాతో స్వర్ణాన్ని సాధించింది.  తద్వారా భారత్.. ఆదివారం బాక్సింగ్ లోనే మూడు పతకాలు గెలిచింది. ఇంతకుముందు నీతూ గంగాస్, అమిత్ పంగల్ కూడా ‘బంగారు బాట’ వేయగా నిఖత్ జరీన్ ఆ  తోవలో మరో పతకాన్ని చేర్చింది. 

ఫైనల్ బౌట్ లో నిఖత్ జోరు చూపించింది. తొలి రౌండ్ నుంచి ఓటమనేదే లేకుండా ఆడుతున్న జరీన్.. ఫైనల్ లో మరింత రెచ్చిపోయింది. తనదైన పంచ్ లతో కార్లీ మెక్‌నాల్ ను మట్టికరిపించింది. తొలి రౌండ్ లో ప్రత్యర్థి పై లెఫ్ట్ హ్యండ్ హుక్ లతో దాడికి దిగిన జరీన్.. రెండో రౌండ్  లో కూడా  అదే జోరును కొనసాగించింది. 

ALso Read:CWG 2022: మన ఇందూరు బంగారానికి స్వర్ణం.. ‘కామన్వెల్త్’లో గోల్డ్ కొట్టిన నిఖత్ జరీన్

మరోవైపు కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్‌ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) హర్షం వ్యక్తం చేశారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహింస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు స్వయంగా నిఖత్ జరీన్‌కు ఫోన్ చేసిన కేసీఆర్ అభినందనలు తెలిపారు. 

అయితే అంతా బాగానే వుంది కానీ.. కామన్‌వెల్త్ గేమ్స్ బాక్సింగ్ ఫైనల్ జరిగిన వేదిక వద్ద తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ (Sports Authority of Telangana) వెంకటేశ్వర్ రెడ్డి (A. Venkateshwar Reddy ) చేసిన ఓవరాక్షన్ వార్తల్లోకెక్కింది. నిఖత్ జరీన్ పంచ్‌లు కొట్టినప్పుడు, చివరిగా ఆమె విజయం సాధించినప్పుడు ఆయన త్రివర్ణ పతాకాన్ని గాల్లోకి తిప్పుతూ కేరింతలు కొట్టారు. ఇక్కడే ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. జాతీయ పతాకానికి ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోను అతికించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మన క్రీడాకారిణి ఫోటోకు బదులు సీఎం చిత్రపటాన్ని ఉంచి సంబరాలు చేసుకోవడం వెనుక లాజిక్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios