CWG 2022: మన ఇందూరు బంగారానికి స్వర్ణం.. ‘కామన్వెల్త్’లో గోల్డ్ కొట్టిన నిఖత్ జరీన్
Commonwealth Games 2022: తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్ పోటీలలో స్వర్ణం సాధించింది. బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన జరీన్.. లక్ష్యాన్ని సాధించింది.
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ నెగ్గిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలలోనూ స్వర్ణం గెలిచింది. ఆదివారం బాక్సింగ్ ఫైనల్స్ లో ‘స్వర్ణ కాంతులు’ విరబూయిస్తున్న బాక్సర్ల జోరుకు మరింత హంగులు అద్దుతూ జరీన్ బంగారు పతకం సాధించింది. మహిళల లైట్ ఫ్లైయిట్ 50 కిలలో విభాగంలో నిఖత్.. నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నాల్ మీద గెలిచింది. ఫైనల్ బౌట్ లో మన నిజామాబాద్ అమ్మాయి.. 5-0 తేడాతో స్వర్ణాన్ని సాధించింది. తద్వారా భారత్.. ఆదివారం బాక్సింగ్ లోనే మూడు పతకాలు గెలిచింది. ఇంతకుముందు నీతూ గంగాస్, అమిత్ పంగల్ కూడా ‘బంగారు బాట’ వేయగా నిఖత్ జరీన్ ఆ తోవలో మరో పతకాన్ని చేర్చింది.
ఫైనల్ బౌట్ లో నిఖత్ జోరు చూపించింది. తొలి రౌండ్ నుంచి ఓటమనేదే లేకుండా ఆడుతున్న జరీన్.. ఫైనల్ లో మరింత రెచ్చిపోయింది. తనదైన పంచ్ లతో కార్లీ మెక్‌నాల్ ను మట్టికరిపించింది. తొలి రౌండ్ లో ప్రత్యర్థి పై లెఫ్ట్ హ్యండ్ హుక్ లతో దాడికి దిగిన జరీన్.. రెండో రౌండ్ లో కూడా అదే జోరును కొనసాగించింది.
ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత బాక్సర్లు పసిడి పంచ్ కొడుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ నీతూ గంగాస్, తన ప్రత్యర్థి ఇంగ్లాండ్ బాక్సర్ డెమీ జాడే రిస్తాన్‌పై విజయం అందుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో నీతూ.. 5-0 తేడాతో డెమీని ఓడించింది.
పురుషుల 51 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్ పంగల్, ఇంగ్లాండ్ బాక్సర్ కియరన్ మెక్‌డొనాల్డ్‌పై అద్భుత విజయం అందుకున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అమిత్ పంగల్, ఈసారి ఏకంగా గోల్డ్ కొట్టాడు.
ఇవాళ ఒక్కరోజే భారత్ కు నాలుగు స్వర్ణాలు రాగా అందులో మూడు బాక్సింగ్ లో వచ్చినవే కావడం విశేషం. మొత్తంగా భారత్ హాకీ, అథ్లెట్లు, బాక్సిర్ల జోరుతో నిన్నటివరకు పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. న్యూజిలాండ్ ను అధిగమించి నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు (మొత్తం 48) ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 164 పతకాలతో దూసుకెళ్తుండగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ (157), కెనడా (85) ఉన్నాయి.