Telangana: వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతులను వ్యవసాయ కూలీలుగా మార్చడంతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వకుండా వారి భూములను లాక్కుందని, సాధారణ రైతులను వ్యవసాయ కూలీలుగా మార్చిందని వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర ఆరోపణలు, ఘాటు విమర్శలతో తెలంగాణ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. భద్రాద్రి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పినపాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో వైఎస్ షర్మిల ఇవాళ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల గురించి పట్టింపు లేదని ఆరోపించారు. తన సమస్యలతో పాటు కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే చింతిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం ఇంటి నుంచి బయటకు వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వకుండా వారి భూములను లాక్కుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ రైతులను వ్యవసాయ కూలీలుగా మార్చిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆమె సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సమాజంలోని అన్ని వర్గాలను సీఎం మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, బోరు బావుల తవ్వకానికి ఆర్థికసాయం అనే మాటే లేదని ఆమె అన్నారు. రైతు బంధు పథకం కింద ఆర్థిక లబ్ధి పొందడం ద్వారా రైతులు లక్షాధికారులుగా మారతారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతులంతా కోటీశ్వరులయ్యారని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఆమె ప్రస్తావిస్తూ.. రైతులు కోటీశ్వరులైతే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎంను ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను గుర్తుచేసుకుంటూ.. అప్పటి సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడేందుకే సొంతంగా పార్టీ పెట్టానని, తమ పార్టీ కొత్త పార్టీ అయినప్పటికీ తన తండ్రి వైఎస్ఆర్ పేరు కొత్త కాదని అన్నారు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె అన్నారు. మళ్లీ తన తండ్రి పాలనను తీసుకువస్తానని చెప్పారు. సాగు చేసిన రైతులకు అన్ని పోడు భూముల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు రోజు "తెలంగాణ తెచ్చింది తామేననీ, జీవితాంతం తమకే ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఎవరు తెచ్చారు తెలంగాణ? కోట్ల మంది ఆకాంక్షిస్తే వచ్చింది తెలంగాణ. లక్షల మంది ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ" అని షర్మిల అన్నారు.
