తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు నిర్ణయించుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఐఏఎస్ అధికారిగా తాను పేదల కోసం కష్టపడ్డానని.. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేశానని ఆయన స్పష్టం చేశారు.

ఏడాది కాలంగా సరైన పనిలేనందున తనకు ఉద్యోగంపై అసంతృప్తిగా ఉందని మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల బయటకు వచ్చి ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశ్యంతో వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసినట్లుగా పేర్కొన్నారు.

పదవీ విరమణ చేశాక... విద్యాభివృద్ధి, పాఠశాలల బాగు కోసం కృషి చేస్తానని మురళీ వెల్లడించారు. వీఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందని.. అయితే ఆలస్యమైందని ఆయన తెలిపారు.

మరో పది నెలల పదవీ కాలం ఉన్న మురళీ ప్రస్తుతం పురావస్తు శాఖలో సంచాలకులుగా ఉన్నారు. అయితే తన పదవీ విరమణను ఆగస్టు 31 నుంచి అనుమతించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీకి మురళీ లేఖ రాశారు.