హైదరాబాద్: విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకొన్నారు. విధుల్లోకి చేర్చుకోలేమని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో మంగళవారం నాడు విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను విధుల్లో చేర్చుకోలేదు. దీంతో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ బస్ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Also read:కార్మికులకు షాక్: అంతా మీ ఇష్టమేనా.. విధుల్లోకి తీసుకునేది లేదన్న ఆర్టీసీ ఎండీ

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన విధుల్లో చేరాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి కార్మికులను కోరారు.ఆర్టీసీ జేఎసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 97 బస్ డిపోలకు విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ఆయా బస్ డిపోల వద్దకు చేరుకొన్నారు.

Also read:RTC STrike:మరోసారి వెనక్కు తగ్గిన జేఎసీ, సమ్మె విరమణ

అయితే విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను పోలీసులు అడ్డుకొన్నారు. విధుల్లోకి చేరకుండా బస్ డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

బస్ భవన్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి బస్ డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకొన్నారు. ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి బస్ డిపో వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ బండ్లగూడ, హయత్ నగర్ బస్ డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడం బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్ నగర్, జేబీఎస్ తదితర బస్ డిపోల వద్ద ముందస్తుగా పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా వచ్చారు. డిపోలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల 25వ తేదీన సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. విధుల్లో చేరుతామని ప్రకటించారు. కానీ, లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు తాము విధుల్లో చేర్చుకోబోమని ఆర్టీసీ  యాజమాన్యం ఈ నెల 25వ తేదీ రాత్రి తేల్చి చెప్పేసింది.