హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన పలువురు యూనియన్ నేతలు భేటీ అయ్యారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు తన మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. 

27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధాకరమన్నారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పుకొచ్చారు. సమ్మెపై ప్రభుత్వం మెుండిగా వ్యవహరించడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

రెండు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె, వారి డిమాండ్లపై సీఎం కేసీఆర్ తో చర్చిస్తానన్నారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యచరణకు తన సంపూర్ణమద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఇకపోతే సమ్మెకు దారి తీసిన పరిస్థితులను పవన్ కళ్యాణ్ కు వివరించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ పరిరక్షణ కోసమే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని యూనియన్ నేతలు పవన్ కళ్యాణ్ కు వివరించారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ తాము నోటీసు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అనంతరం తమ సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారని ఆ కమిటీ తమ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదని తెలిపారు. 

ఐఏఎస్ అధికారు కమిటీకి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను వివరించారు. 

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ అనడంపై పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో సెల్ఫ్ డిస్మిస్ అనే పదమే లేదని చెప్పుకొచ్చారు. 

మరోవైపు మంత్రులు సైతం ఆర్టీసీ కార్మికుల మనోభవాలు దెబ్బతినేలా కామెంట్లు చేశారని ఆరోపించారు. అందువల్లే తమ కార్మికులు మనస్తాపానికి గురై గుండెపోటుతో కొందరు, ఆత్మహత్య చేసుకుని మరికొందరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోపాటు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతల సంఘీభావం ఉందన్నారు. తమరు కూడా మద్దతు ప్రకటించాలని కోరారు. అలాగే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ను ఆర్టీసీ జేఏసీ నేతు కోరారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్: అశ్వత్థామరెడ్డి పిలుపు

కేసీఆర్ ఒంటరి, మంత్రులు కూడా లేరు: విజయం మనదేనన్న ప్రొ.కోదండరామ్