హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ లో కాంట్రాక్టు ప్రాతిఏపీదికన డ్రైవర్లను కండెక్టర్లను నియమించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే కొందరు తాత్కాలిక డ్రైవర్లను కండెక్టర్లను నియమించుకొని ఆర్టీసీ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం కాంట్రక్టు ప్రాతిపదికన నియమించుకున్న డ్రైవర్లకు రోజుకు 1500 రూపాయలు, కండక్టర్లకు రోజుకు 1000రూపాయలను ఇస్తున్నారు. 

పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టడానికి మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ఇలా మరికొంత మందిని తాత్కాలిక పద్ధతిన నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డ్రైవర్లు కండెక్టర్లను మాత్రమే కాకుండా, మెకానిక్, ఎలక్ట్రీషియన్, శ్రామిక్ వంటి అనేక ఇతర పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. 

పోలీసు శాఖలో, ఆర్టీసీలో విశ్రాంత డ్రైవర్ల నుండి కూడా ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇలా మరింత మందిని తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడపడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తున్నా విషయం తెలిసిందే. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు మరణించాడు.