హైదరాబాద్: వజ్ర బస్సులను కరోనా సంచార కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడు ఏసీ వజ్ర ఏసీ బస్సులను ప్రస్తుతం సంచార కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చారు. ఏపీ రాష్ట్రంలో ఇదే తరహాలో ఆర్టీసీ బస్సులను మొబైల్ కోవిడ్ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడ ఇదే ఫార్మూలాను ఆర్టీసీ అనుసరిస్తోంది.  ప్రస్తుతం మూడు వజ్ర బస్సుల ద్వారా ప్రతి రోజూ 750 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రంలో మరిన్ని బస్సులను కోవిడ్ పరీక్షా కేంద్రాల కోసం వినియోగించనున్నారు.

తెలంగాణలో 100 వజ్ర బస్సులున్నాయి. వీటిలో 66 బస్సులు కండిషన్లో ఉన్నాయి. ఈ బస్సుల నిర్వహణ వ్యయంతో కూడింది. దీంతో ఈ బస్సులను అమ్మేయాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం భావించింది. ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది.

వజ్ర బస్సులన్నీ ఆయా డిపోలన్నీ షెడ్డుల్లోనే ఉన్నాయి. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు గాను వజ్ర బస్సులను మొబైల్ టెస్టు సెంటర్లుగా మార్చాలని భావించిన అధికారులు ప్రయోగాత్మకంగా మూడు బస్సులను కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చారు.

ఒక్కో బస్సులో ముగ్గురు టెక్నీషీయన్లు ఉంటారు. పరీక్ష కోసం వచ్చే వారి నుండి శాంపిల్స్ సేకరించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. బస్సుకు రెండు వైపులా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా అనుమానితులనుండి శాంపిల్స్ సేకరిస్తారు.