రంగంలోకి ఆర్మీ హెలికాఫ్టర్లు.. మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితం, వూరు మొత్తం ఖాళీ
భారీ వర్షాలు , వరదల కారణంగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులను సహాయక సిబ్బంది రక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు ఆర్మీ హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు.
భారీ వర్షాలు , వరదల కారణంగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులను సహాయక సిబ్బంది రక్షించారు. మోరంచ వాగు ఉప్పొంగడంతో గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. దాదాపు 10 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో గ్రామం మొత్తం మునిగిపోయింది. దీంతో ప్రజలు ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కి సహాయం కోసం అధికారులకు సమాచార అందించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
తొలుత బోట్ల ద్వారా గ్రామస్తుల తరలింపు ప్రక్రియ చేపట్టగా.. వరద ప్రవాహం తీవ్రంగా వుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు ఆర్మీ హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. దీంతో వేగంగా తరలింపు ప్రక్రియ చేపట్టారు. వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు అధికారులు. ప్రస్తుతం గ్రామం మొత్తం ఖాళీ అవ్వగా.. ఎవరైనా చిక్కుకుపోయారన్న అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.