సారాంశం

Hyderabad: రాష్ట్ర‌వ్యాప్తంగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌తో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. అనేక నీటి ప్రాజెక్టుల్లో నీటి ప్ర‌వాహం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరింది. అనేక గ్రామాలు నీట మునిగాయి. మ‌రో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.
 

Telangana rains: తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌తో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నాల మ‌ధ్య ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి సూచిస్తూ మందస్తు చ‌ర్య‌లు తీసుకుంటోది. బుధ‌వారం సాయంత్రం నుంచి ప‌డుతున్న వ‌ర్షంతోనే హైద‌రాబాద్ న‌గ‌రంలో గురువారం మేల్కొంది. న‌గ‌రంలో ఇంకా భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రిస్తూ.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం జూలై 26 ఉదయం 8:30 నుండి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదైంది. నగరంలో అత్యధికంగా బండ్లగూడలో 54.8 మిల్లీ మీట‌ర్లు, గోల్కొండలో 51.3 మిల్లీమీటర్లు, షేక్‌పేటలో 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్యలను సృష్టించడమే కాకుండా, వివిధ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ సమస్యలకు దారితీసింది. నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య హిమాయత్ సాగర్ వరద గేట్లను నిన్న సాయంత్రం 4 గంటలకు ఎత్తివేశారు. మూసీ నదిలోకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు మధ్యాహ్నం 2:30 గంటలకు ఉస్మాన్ సాగర్ రెండు వరద గేట్లను కూడా ఎత్తివేశారు.

టీఎస్‌డీపీఎస్ నివేదిక ప్రకారం, జూలై 28 వరకు హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD హైదరాబాద్, టీఎస్‌డీపీఎస్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలనీ, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.