Heavy Rain: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా రాష్ట్రలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు జిల్లాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  

Hyderabad Rain Alert: తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు వేగంగా క‌దులుతుండ‌టంతో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్పికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. గురువారం నాడు హైదరాబాద్ స‌హా ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్థానిక వ‌తావ‌ర‌ణ కేంద్ర హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే ఎల్లో, ఆరెంజ్ అల‌ర్ట్ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేసింది. 

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలైన కొత్తగూడెం, జనగాం, జయశంకర్ భూపాల పల్లె, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండలో కూడా గురువారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. జూలై 9 వ‌ర‌కు హైద‌రాబాద్ నగరంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 32-33, 22-24 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉండే అవకాశం ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ జిల్లా సర్వాయిపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక గురు, శుక్రవారాల్లో దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాబోయే ఐదు రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ విభాగం అధికారులు తెలిపారు. 

Scroll to load tweet…

ఇదిలావుండ‌గా, ప్ర‌స్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పొటెత్తాయి. మ‌హారాష్ట్రలో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. ముంబ‌యి, థానేలో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. భారీ వ‌ర్షం కార‌ణంగా వ‌ర‌ద‌లు కొన‌సాగుతున్నాయి. బుధవారం నాడు ముంబ‌యి మెట్రోపాలిటన్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నమోదైంది. ముంబ‌యిలో జూలై 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచ‌నా వేసిన భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ).. మంగళవారం నాడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కురుస్తున్న భారీ వర్షాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పరిస్థితిని పర్యవేక్షించాలని, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.