Hyderabad: మోటర్ సైకిళ్లపై మోజుతో పాటు.. తన విలాసాలు, జల్సాలను తీర్చుకోవడానికి వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నిందితుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, 22 వాహనాలు, ఒక మొబైల్ ఫోన్, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
Telangana: మోటర్ సైకిళ్లపై మోజు.. జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22కు పైగా ద్విచక్ర వాహనాలను ఇప్పటివరకు దొండిలించాడు. ఈ క్రమంలోనే మరో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి తీసుకెళ్తుండగా.. పోలీసులకు అనుమానంగా కనిపించాడు. రాచకొండ కమిషనరేట్‌లోని ఉప్పల్ పోలీసు అధికారులు బుధవారం నాడు వాహన తనిఖీలు చేస్తుండగా దొంగిలించబడిన యాక్టివా మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, ఉప్పల్‌లోని వీటీ కమాన్ వద్ద ఆపి.. పోలీసులు తమదైన తరహాలో ప్రశ్నించగా.. వివరాలు వెల్లడిస్తూ.. చేసిన వాహన దొంగతనాలను ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు 22 వాహనాలను దొంగిలించినట్టు తన నేరాలను అంగీకరించాడు.
పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నేరస్తుడు రాజు వివిధ రకాల మోటార్‌సైకిళ్లపై రోడ్లపై తిరగడం ఇష్టం. ఈ నేపథ్యంలోనే రాత్రివేళల్లో నగరానికి వచ్చి బస్టాండ్‌లు, మెట్రో స్టేషన్‌లలో మోటార్‌సైకిళ్లను దొంగిలించేవాడు. వాహనం దొంగిలించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు, ఇతరులు లేని సమయం చూసుకుని తన వద్ద వున్న నకిలీ కీలతో బైకులను ఎత్తుకెళ్తేవాడు. ఇలా దొంగిలించిన వాహనాలను ఏటూరు గ్రామస్తులకు విక్రయిస్తున్నాడు. గ్రామస్తులను నమ్మించడానికి "తను ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నానని చెబుతూ.. ఫైనాన్స్ కార్యాలయంలో వాహనానికి సంబంధించిన అమ్మకపు ప్రక్రియను క్లియర్ చేసిన ఒక నెలలోపు ఫైనాన్స్ కంపెనీ నుండి తక్కువ ధరకు వాహనాన్ని కొనుగోలు చేసి వాహన పత్రాలను అందజేసేవాడు. ఇలా తన విలాసవంతమైన ఖర్చుల కోసం ఆ మొత్తాన్ని వెచ్చించేవాడు" అని పోలీసులు తెలిపారు.
నిందితుడి నేపథ్యం గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నేరస్థుడు రాజు అతని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. నిందితుడి తండ్రి మల్లయ్య ఐస్‌క్రీంలు అమ్ముతుంటారు. తల్లి చిల్కమ్మ వ్యవసాయ కూలీగా కొనసాగుతున్నారు. అతని తండ్రి రెండవ వివాహం చేసుకొని విడివిడిగా నివసిస్తున్నాడు. 8వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత చదువులపై ఆసక్తి లేకపోవడంతో మధ్యలోనే వదిలేసి..నాగోల్, LB నగర్ ప్రాంతంలో లైటింగ్ పనికి వెళ్లి నెలకు 12,000/- సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే మద్యం సేవించడం, సిగరెట్ తాగడం వంటి అన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అతని సంపాదన అతని విలాసవంతమైన ఖర్చులకు సరిపోలేదు. దీంతో తన విలాసవంతమైన ఖర్చులను తీర్చుకోవడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే బైక్ దొంగిలించి అమ్మడం చేస్తున్నాడు అని పోలీసులు తెలిపారు.
రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ ఎం భగవత్ IPS, జీ సుధీర్ బాబు IPS, Addl కమీషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, రక్షిత కె. మూర్తి IPS, మల్కాజిగిరి జోన్, యాదగిరి IPS క్రైమ్ DCP పర్యవేక్షణలో పీ. నరేష్ రెడ్డి, ACP మల్కాజిగిరి, ఇన్స్పెక్టర్లు R. గోవింద్ రెడ్డి SHO ఉప్పల్ PS, D. నర్సింగ్ రావు DI ఆఫ్ పోలీస్ , ఉప్పల్ PS, ఎస్. కోటేశ్వర్ రావు డిఎస్‌ఐ, క్రైమ్ టీమ్ నేరస్థుడిని పట్టుకుని 22 మోటారు సైకిళ్లను రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.13,50,000 లను స్వాధీనం చేసుకున్నారు.
