మూడు దశల పోరాట వీరులు... గుర్తింపునకే నోచు కోలేదు

First Published 15, Feb 2017, 10:51 AM IST
Telangana prajasamiti demands due recognition for Telangana fighters
Highlights
  • 20 ఏళ్ల నాటి భువనగిరి సభ చైతన్య స్ఫూర్తితో పోరుకు సిద్ధమవుతున్న ఉద్యమకారులు 
  • మార్చి 8 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజా తెలంగాణ సంస్థ 
  • ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు పాల్గొన్న త్యాగధనుల గుర్తింపునకు పోరుబాట

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన భువనగిరి సభ చైతన్య పోరాట స్ఫూర్తిని స్మరించుకొనే సమయం వచ్చింది. మార్చి 8 తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఆ సభ తీర్మానాలు ఇప్పుడు నిజంగా అమలయ్యాయి. నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరుసలిపిన ఉద్యమవీరులు ఇప్పుడు ఏం చేస్తున్నారు. బంగారు తెలంగాణలో వారి బతుకులు ఎలా ఉన్నాయి.. ఆంధ్రా పెట్టుబడిదారులకు రెడ్ కార్పొట్ వేసి తాయిలాలు ఇస్తున్న తొలి తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమవీరులకు కనీసం పెన్షన్ అయినా ఇస్తోందా...

 

1952 ముల్కీ ఉద్యమం, 1969 తొలి తెలంగాణ ఉద్యమం, 1997 భువనగిరి సభ నుంచి మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన తమకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదన్నది వారి ఆవేదన.

 

అందుకే భారత స్వాతంత్ర్య సంగ్రాహంలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తున్నట్లు తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఆరు డిమాండ్లు చేస్తూ దీనిపై మార్చి 13 న ప్రజా తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో దీక్ష ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

 

1). 1956 నుంచి ఇప్పటి వరకు అన్ని దశల్లో పాల్గొన్న అర్హులైన త్యాగధనులకు, ఉద్యమకారులకు జీవితకాల పెన్షన్లు ఇవ్వాలి.  ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

 

2). 1996 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని కేసులకు గురై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. సుమారు 3500 మందిపై కేసులు, దాదాపు లక్షమందిపై సమన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎత్తేయాలి.

 

3). 1969 ఉద్యమంలో జైలు పాలైన, త్యాగాలు చేసిన, అమరవీరుల కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకోడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి.

 

4). చివరిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని  అమరులైన సుమారు 1250 మంది కుటుంబాలలో కేవలం 503 కుటుంబాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన వారికి వెంటనే న్యాయం చేయాలి.

 

5). రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక వహించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

 

6). ముఖ్యమంత్రి జూన్ 15, 2014 న శాసన సభలో ప్రకటించినట్లుగా అన్ని దశల త్యాగధనుల, ఉద్యమకారులకు సంపూర్ణ, సత్వర న్యాయం చేయడానికి వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలి.

 

మరోవైపు మార్చి 8 నాటికి భువనగిరి సభ నిర్వహించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున  20 ఏళ్ల భువనగిరి సంకల్పం ప్రస్థానం పేరుతో సదస్సు నిర్వహించనున్నట్లు కూడా  ప్రజా తెలంగాణ సంస్థ ప్రకటించింది.

 

loader