హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నిర్వహణపై పరిస్థితిని అంచనా వేయడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) బృందం ఈ నెల 11వ తేదీ హైదరాబాదు రానుంది.

దానికి ముందే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) రజత్ కుమార్ సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈసికి ఆయన తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి గల అవకాశాలపై ఆయన ఆ నివేదికను సమర్పిస్తారని అంటున్నారు. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభల కాల పరిమితి డిసెంబర్ 15, జనవరి 20వ మధ్య ముగుస్తుంది. తెలంగాణ శాసనసభ గడువు సెప్టెంబర్ 6వ తేదీతో ముగిసింది.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసి అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేసి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను అక్టోబర్ రెండవ వారంలో విడుదల చేసి నవంబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది.