తెలంగాణ ఎన్నికల సందర్భంగా సినీనటి, కాంగ్రెస్ నేత కుష్భూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా అదిలాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న కుష్భూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటున్నారు. హిందువుల ఓట్ల కోసం ఆయన అలా మాట్లాడారని అభిప్రాయపడ్డారు.

అలాగే అధికారంలోకి వస్తే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామన్న టీఆర్ఎస్ హామీపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 12 శాతం రిజర్వేషన్లకు బదులు భాగమతి బిర్యానీ ఇస్తారని అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని.. ఇక్కడికి ఎవరు వచ్చినా ముందుగా బిర్యానీ రుచి చూస్తారని కుష్భు తెలిపారు.

టీఆర్ఎస్ గుర్తు కారు పాత మోడల్ అయిపోయిందని... ప్రస్తుతం మార్కెట్‌లో దొరకడం లేదని దానిని తయారు చేసే కంపెనీని కూడా మూసివేశారని ఎద్దేవా చేశారు. అలాగే టీఆర్ఎస్ కూడా పాతదైపోయిందని దానికి ప్రస్తుతం డిమాండ్ లేదని కుష్భూ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదని దేనికి ఓటు వేసినా రెండో దానికి ఓటు పడినట్లేనని కుష్భూ ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి చర్యల ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో సంపదను కొల్లగొట్టారని ఆమె ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో కుమ్మరిస్తున్నారని కుష్భూ అన్నారు. తెలుగులో చేసిన ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.