హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కె. చంద్రశేఖర రావు మరోసారి సహనం కోల్పోయారు. ఆలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంగళవారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంది. తాను ప్రసంగిస్తున్నప్పుడు అల్లరి చేసిన గుంపు ను ఉద్దేశించి బేవకూఫ్ లంటూ తిట్టాడు. పిచ్చోళ్లా అంటూ ప్రశ్నించారు. 

నీటి పారుదల రంగం గురించి కేసీఆర్ మాట్లాడుతుండగా కొంత మంది అల్లరి చేయడం ప్రారంభించారు. దాంతో చిరాకు పడిన కేసీఆర్ ఎందుకు అరుస్తున్నారు, మీరు బేవకూఫ్ గాళ్లా, బుద్ధి లేదా, పిచ్చోళ్లయినట్లున్నారు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. 

వారిని అదుపు చేయడానికి లీడర్ ఎవరు లేరా అని కూడా ప్రస్నించారు. వేరేవాళ్లయినా నా స్పీచ్ వినాలా, వద్దా, పది నిమిషాల పాటు మౌనంగా ఉండలేరా అని అడిగారు. 

వేదిక మీది నుంచి పరిస్థితిని అదుపు చేయడానికి పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రయత్నించారు. అది ఉత్సాహం సార్ అని ఆయన కేసీఆర్ తో చెప్పారు. అర్థం లేని ఉత్సాహం అని ఆయన అన్నారు. బుద్ధిలేని ఉత్సాహం వల్ల ఉపయోగం లేదని అన్నారు.

కేసీఆర్ సహనం కోల్పోయి మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.