నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి 50 కేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు.

నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్‌దేనని, వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అనంతరం బోధన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. కాగా ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 12 న జరగనుంది.